Business Tips: సాధారణంగా పెద్ద స్థాయిలో కోళ్లను పెంచాలంటే ఫారం అవసరమవుతుంది. కానీ ఫారం అవసరం లేకుండా పెరట్లో పెంచుకొనే రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. సాధారణంగా కోళ్ల వ్యాపారం చేసే వాళ్ళకి నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్ల గురించి తెలిసే ఉంటుంది. కానీ రాజశ్రీ రకం వాళ్ల గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది.
పెరట్లో పెంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేయవచ్చునని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే స్త్రీలు ఇంటిపట్టునే ఉంటూ ఈ కోళ్ల వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అందుకు ప్రభుత్వాలు కూడా సబ్సిడీల ద్వారా గ్రామ మహిళలని ప్రోత్సహిస్తున్నాయి. ఈ కోడి పిల్లలని ఒక రోజు వయసు ఉన్నప్పటి నుంచి తెచ్చి పెంచుకోవచ్చు.
కోడి జాతులు అన్నిట్లోకి రాజశ్రీ రకం విభిన్నమైనది. ఇవి మరీ చిన్నగాను కాకుండా మరి పెద్దగా ను కాకుండా మధ్యస్థంగా ఉండి కాళ్లు పొడుగ్గా ఉంటాయి. అందువల్ల వేగంగా పరిగెడతాయి. వీటి గుడ్లు బరువు కూడా మిగతా జాతి గుడ్లు కన్నా ఎక్కువగా ఉంటుంది. రాజశ్రీ కోడిపుంజు ఐదు నెలల్లో రెండు కేజీలు పెరుగుతుంది. అదే పెట్ట విషయానికి వస్తే కేజీ పైన పెరుగుతుంది. మిగిలిన కోళ్లు గుడ్లు పెట్టడానికి 7 నెలల సమయం తీసుకుంటుంది కానీ రాజశ్రీ కోళ్లు ఐదో నెల నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. 17 నెలల్లో 160 గుడ్లు పెడుతుంది. అదే నాటు కోళ్లు అయితే 17 నెలల్లో 60 గుడ్లు మాత్రమే పెడతాయి.
Business Tips:
ఆరు నెలల వరకు కరెంటు లైట్ ల మధ్యలో పెంచి తర్వాత పెరట్లో పెంచుకోవచ్చు. ఈ కోళ్లు గుడ్లను పొదగవు కాబట్టి నాటుకోడి ద్వారా అయినా ఇంక్యూబేటర్ ద్వారా అయినా గుడ్లను పొదగవచ్చు. మార్కెట్లో దీని ధర కూడా కేజీ 500 వరకు పలుకుతుంది. దాణా ఖర్చు కూడా తక్కువే కాబట్టి మంచి లాభాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.