RBI Announcement on Rs.1000 Notes : పెద్ద నోట్లు రద్దు చేసి చాలా ఏళ్లు అయింది. రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లను తీసుకొచ్చింది. అలాగే.. కొత్త 100, 50, 20, 10, 200 నోట్లను కూడా తీసుకొచ్చింది. అయితే.. పాత 100, 50, 10, 20 నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. ఇందులో రూ.1000 నోటు మాత్రం చలామణిలో లేదు. అయితే 2000 నోటు ప్రింటింగ్ కూడా ఆపేసి.. 2000 నోటును కూడా ఆర్బీఐ ఇటీవల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కొత్త వెయ్యి రూపాయల నోటును తిరిగి ఆర్బీఐ తీసుకురాబోతోందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి.
దీనిపై తాజాగా ఆర్బీఐ క్లారిటీ ఇచ్చేసింది. అసలు వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన లేదని.. వెయ్యి రూపాయల నోటు వచ్చే ప్రసక్తే లేదని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. మళ్లీ 1000 నోటును తీసుకువస్తున్నారు అనేది అంతా అబద్ధం.. అందులో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనలు అయితే ప్రస్తుతం లేవు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు.
RBI Announcement on Rs.1000 Notes : భవిష్యత్తులోనూ 1000 నోటు వచ్చే చాన్స్ లేదా?
భవిష్యత్తులోనూ 1000 నోటు వచ్చే చాన్స్ లేదని ఆర్బీఐ ప్రకటన బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. పాత 500 స్థానంలో కొత్త 500 వచ్చింది. 1000 స్థానంలో 2000 నోటు వచ్చింది. కానీ.. అది పెద్ద నోటు కావడంతో దానికి చిల్లర సమస్యలు రావడంతో ఆ నోటును ఇటీవలే ఆర్బీఐ ఉపసంహరించుకుంది. నవంబర్ 2016 లో పాత 500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది. రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కానీ.. ఇంకా కొందరు మార్చుకోలేకపోయారని తెలిసి అక్టోబర్ 7, 2023 వరకు ఆర్బీఐ నోట్లు మార్చుకోవడానికి సమయాన్ని పెంచింది. అక్టోబర్ 8 నుంచి ఇంకా 2000 నోట్లు ఉన్నవాళ్లు బ్యాంకులకు కాకుండా దేశంలో ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదా 2000 నోట్లకు బదులు ఆ డబ్బును వాళ్ల బ్యాంక్ అకౌంట్ లో ఆర్బీఐ క్రెడిట్ చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా మీ దగ్గర 2000 నోట్లు ఉంటే వెంటనే ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి వెంటనే మార్చుకోండి.
ఒకవేళ భవిష్యత్తులో 1000 నోటును తీసుకొచ్చినా అది పాత నోటులా కాకుండా మళ్లీ 500 లేదా 2000 నోటును పోలి ఉండే అవకాశం ఉంది. కానీ.. 1000 రూపాయల నోటును మళ్లీ తీసుకురావాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు పెద్ద నోటు అంటే 500 మాత్రమే. అధిక మొత్తంలో డబ్బును తీసుకెళ్లాలంటే 500 నోట్లతో కష్టంగా మారడంతో 1000 రూపాయల నోటును తీసుకురావాలని ప్రజల నుంచి డిమాండ్ కూడా వినిపిస్తోంది.