Jyeshta Masam జ్యేష్ఠ మాసం : తెలుగు మాసాలలో మూడోవది జ్యేష్టమాసం. గ్రీష్మ రుతువు ప్రారంభం. తాపం పెరుగుతుంది. జూన్‌ 11 నుంచి జ్యేష్టమాసం ప్రారంభం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో పూర్ణమి వస్తున్నందున ఈ మాసాన్ని జ్యేష్ఠమాసం అని పిలుస్తారు. ఈ మాసంలో కొన్ని పండుగలున్నాయి. జ్యేష్ఠ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని ధర్మ శాస్త్రాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. ఈ మాసం లో చేయాల్సిన దానం జలం. దీన్ని దానం చేయడం చాలా మంచి ఫలితాన్నిస్తుంది.

జ్యేష్ఠ మాసం (జ్యేష్టంలో) వచ్చే పండుగలు

జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభాతృతీయ జరుపుకొంటారు, ఈ రోజు పార్వతి దేవిని పూజిస్తారు. దానాలకు శుభకాలంగా చెప్పబడింది. ముఖ్యం గా అన్న దానం చేయడం ఉత్తమం.

జ్యేష్ఠశుద్ద దశమి రోజున ఇష్ట దైవ పూజ, ఆలాయాల సందర్శించడం మంచిది . దీనికే దశపాపహర దశమి అని పేరు. అంటే పది పాపాలను పోగొట్టే దశమి అని. ఈ పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం చేయడం, లేదంటే ఏదైనా నది లో స్నానం మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి , పేలపిండి, బెల్లం ముద్దలని నదిలో వేయాలి.
జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు,పాయసం, పానకం, నెయ్యి, గొడుగు దానం చేయాలని శాస్త్ర వచనం. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం పొందవచ్చు

జ్యేష్ఠ శుద్ద ద్వాదశి ని కూడా దశహరా ద్వాదశి అని కూడా అంటారు. దుర్దశలను పోగొట్టగలిగే శక్తి గల తిథి ఇది. ఈరోజు నది స్నానాలుచేయడం, నదీ స్నానానికి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయం లో గంగా, గంగా, గంగా అని ని స్మరించడం ఉత్తమం గా పండితులు పేర్కొంటున్నారు.

జ్యేష్ఠ పూర్ణిమ ని మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథ యాగం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం తో కూడిన జ్యేష్ఠ మాసాన గొడుగు, చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమగతుల తో పాటు సంపదలు ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం ద్వారా తెలుస్తుంది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి.
జ్యేష్ఠ పౌర్ణమి కి ఏరువాక పున్నమి అని పేరు ఈ రోజు రైతుల పండుగ, వారి ఎద్దులను అలంకరించి పొంగలి పెడతారు వాటి ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకొని వెళ్లి దుక్కి దున్నిస్తారు.

జ్యేష్ఠ మాసం లో పౌర్ణమి వెళ్ళిన తర్వాత పదమూడవ రోజు మన దేశవ్యాప్తం గా మహిళలు వాటసావిత్రి వ్రతం చేసుకొంటారు. భర్తలు పది కాలాల పాటు చల్లగా, సంపూర్ణ ఆరోగ్యం తో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ స్త్రీలు పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశినే అపర ఏకాదశి అంటారు. దీనినే సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకొన్న పనులు నేరవేరుతాయి.

జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి, ప్రదోష కాలంలో శివునికి అభిషేకం బిల్వ దళ పూజ చేయడం వలన అకాల మరణం బాధలు పోతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి మాసం కూడా మనకు ఒక మంచిని బోధిస్తుంది. క్షణభంగురమైన ఈ జీవితంలో ఇహం, పరం కోసం చేసుకోవాల్సిన విధులను ఆయా మాసాలు మనకు పేర్కొన్నాయి. మనం బ్రతుకుతూ ఇతరులకూ సహాయం చేయడం అత్యంత ముఖ్యమైన సేవ అదే మానవసేవనే మాధవ సేవగా పేర్కొంది సనాతనధర్మం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 10, 2021 at 7:59 సా.