అక్షయ తృతీయ..

భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో చేసుకునే పండుగలలో ఇది ఒకటి. అక్షయ తృతీయను కొన్ని ప్రాంతాల్లో అఖా తేజ్ అని కూడా అంటారు. ఈ పండగ అదృష్టాన్ని, విజయాన్నీ తెస్తుందని హిందువులు విశ్వసిస్తారు. మన పంచాంగం ప్రకారం వైశాఖమాసంలో శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ అక్షయ తృతీయ అనేది ఒక సంస్కృత పదం. ‘అక్షయ’ అంటే ‘శాశ్వతమైనది, ఆనందం, విజయం. అదేవిధంగా ఆనందం ఎప్పటికీ తగ్గని భావన. ఇక ‘తృతీయ’ అంటే ‘మూడవది’. అందువల్ల, ఈ రోజున ఏదైనా జప, యజ్ఞ, పితృ తర్పణ, దాన పుణ్యాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఎప్పటికీ తగ్గిపోవని భక్తుల విశ్వాసం.

ఈ రోజు ప్రాతఃకాలంలో లేచి స్నానసంధ్యాదులను పూర్తిచేసుకోవాలి. తప్పనిసరిగా అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. అదేవిధంగా పేదలకు, అవసరార్థులకు తప్పనిసరిగా దానాదులను చేయాలి. ఇలా చేయడం వల్ల అక్షయ ఫలితం వస్తుంది. అంతేకాదు అవకాశం ఉన్నవారు ఆయా ప్రాంతాలలో ఉన్న విశ్వాసం ప్రకారం కొంచెం బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి సంపద తరిగిపోదని వారి నమ్మకం.

అక్షయ తృతీయనాడు బంగారం ఎందుకు కొంటారు ?
వైశాఖంలో వచ్చే మొదటి పండుగ అక్షయ తృతీయ. ఇది కేవలం హిందువులే కాకుండా జైనులు కూడా పవిత్రంగా జరుపుకొనే పండుగ. ఈ పండుగ రోజు బంగారం కొనడం తరతరాలుగా వస్తుంది. అయితే దీనివెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం… అక్షయ అంటే తరగిపోనిది. క్షయం కానిది అని అర్థం. శాస్త్రం ప్రకారం… అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా ఆ పని వలన వచ్చే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు. అందుకే ఈ రోజు ఇంటికి బంగారం తెచ్చు కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుందని విశ్వాసం పూర్వకాలం నుంచి వస్తుంది. ఈ కారణంతోనే అక్షయ తృతీయ రోజున ఎక్కువమంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

పురాణాల ప్రకారం
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇంత పవిత్రమైన రోజు కాబట్టే బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 13, 2021 at 12:12 సా.