Koti Deepotsavam 2023: ప్రతి ఏడాది ఎన్టీవీ న్యూస్ ఛానల్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహా దీపయజ్ఞం ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అశేష జనం మధ్య భక్తి టీవీ ఎన్టీవీ ఆధ్వర్యంలో దాదాపు 14 రోజుల పాటు ఈ మహా వైభవం కొనసాగుతుంది. కార్తీక మాసంలో కదిలి వచ్చిన కైలాసమే ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో శివకేశవులను ఒకే వేదికపై కోటి దీపాల మధ్య దర్శించుకోవడం కోసం వేళల్లో లక్షల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుళ్ల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఓం నమశ్శివాయ అనే మంత్రంతో మొత్తం మారుమోగుతూ ఉంటుంది. ఒకవైపు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, మరొకవైపు కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తుల శివనామస్మరణలు ఇలా ఆ ప్రాంగణమంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పవచ్చు.
అంతే కాకుండా తిరుమల,యాదగిరిగుట్ట సింహాచలం, భద్రాచలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, వేములవాడ, బెజవాడ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. అన్నిటికీ మించి భక్తులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సందర్బం దేదీప్యమాన దృశ్యం. కోటి కాంతులు ఒకేసారి ప్రసరించే దివ్యానుభవం. దీప ప్రజ్వలనం.
ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేము
లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేము. మన సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. దాదాపుగా పదేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతూనే వస్తోంది. మొత్తంగా దీపం జ్యోతి పరబ్రహ్మ అనే దివ్యసందేశం ఇవ్వడమే ధ్యేయంగా సాగే ఈ కోటి దీపోత్సవం ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది.