Worshiping With Flower Garlands పూల మాలలతో పూజిస్తే కలిగే ఫలితాలు ఇవే !

భగవంతుడికి పుష్పార్చన అత్యంత విశేషం. ఆయనను అర్చించే విధానాలలో పుష్పార్చనకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. పుష్పాలను మాలలుగా కట్టి భగవంతునికి ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. ఆయా పురాణాలలో, పెద్దలు చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

పూలమాలలు
దేవుడి అర్చనలో పుష్పాలది ప్రధానపాత్ర. దీనివల్ల మానసిక, శారీరక ప్రశాంతత వస్తుంది. ఇటువంటి పూలమాలలో అనేక రకాలు ఉన్నాయి. పూలమాలలు కట్టుడం అనేది 64 కళలలో ఒకటి. పూలమాలలను వివిధ వర్ణములు, వివిధ జాతులకు చెందిన పుష్పములతో కలగలిపి కట్టిన మాలలు ప్రధానంగా మూడు రకములు అవి…

హృదయము వరకే ఉండే పొట్టి మాలలను రైక్షికములు అంటారు. ఈ మాలలు ఆనందమును కలిగిస్తాయి. నాభి (బొడ్డు) క్రిందకు ఉండే మాలలు సాధారణియములు. ఈ మాలలు ఆనందమును రెట్టింపు చేస్తాయి. పాదపద్మములపై పడే వానిని వనమాల అంటారు. ఇది అన్ని మాలల కన్నా ఉత్తమమైనది.

ఏ మాలల వల్ల ఏం ఫలితం ?
• ఆయా రకాల పూలమాలలను భక్తితో, శ్రద్ధతో భగవంతునికి అర్పిస్తే అనేక ఫలితాలు వస్తాయి. వాటిలో ఏ మాలలను అర్పిస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం…
• మారేడు దళ దండతో పూజించిన లక్ష గోవులను దాన మిచ్చిన ఫలితం దక్కుతుంది.
• అమ్మవారికి అన్ని పూవుల కంటే మారేడు దళములంటే అత్యంత ప్రీతి. రాత్రి పూట కడిమి పూలతోను ఇరు సంధ్యల యందు మల్లికలతోను మిగిలిన సమయమందు మిగిలిన అన్ని పువులతోను అమ్మను పూజించవచ్చు.మహాలక్ష్మి అమ్మవారినిఅన్ని పూలతో పూజింపవచ్చు. కాని తులసి, గిరింత, దేవ కాంచన, గరికతో పూజింపరాదు.
• సుగంధ పుష్పములను విడిగా కాని, మాలలు కట్టికాని అమ్మవారిని పూజించిన అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది.
• పొగడ పూలతో మాల కట్టి అమ్మవారికి సమర్పించిన వాజిపేయ యాగం చేసిన ఫలితం దక్కుతుంది.
• గన్నేరు,పొగడ,దమనం,నల్లకలువ,తామర,సంపెంగ,జాజి మొదలగు పూలతో కట్టిన మాలలు రైక్షికములైనా అమ్మకు చాలా ఇష్టం. మారేడు దళములతో అల్లిన రెండు దండలను అమ్మకు అర్పించిన రాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
• తుమ్మి పూల దండతో అమ్మను పూజించిన కానిరాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
• దుర్గాదేవిని అన్ని పూలతో పాటు జిల్లేడు మందారములతో పూజింపవచ్చు.
• దుర్గ, లక్ష్మిలకు తప్ప ఇతర దేవతలెవ్వరికీ జిల్లేడు, మందారములతో పూజింపరాదు
• దుర్గాదేవిని మల్లె,జాజి,అన్ని రకముల తామరలు, గోరింట, సంపెంగ, పొగడ, మందారం, గన్నేరు, జిల్లేడు, దవనం, మరువం, లేత గారిక, దర్భ పూలు, రెళ్ళు పూలు, మారేడు దళములు, అన్ని విధాల పూవులతోను, ఆకులతోనూ పూజింప వచ్చును.
• జమ్మి పూల దండతో అర్చన చేసిన వెయ్యి గోవులను దానమిచ్చిన ఫలితం దక్కుతుంది.
• రెళ్ళు పూల దండతో అర్చన చేసిన పితృ లోకాలు కలుగుతాయి.
• నల్ల కలువ పూల దండతో అర్చన చేసిన దుర్గాదేవికి ప్రియ భక్తుడై రుద్రలోకంలో నివసిస్తాడు.
• పూలు దొరకని రోజులలో ఆకులతో పూజింప వచ్చును.
• నేలపై, నీటిలో పుట్టిన సుగంధ పుష్పాలను అమ్మ ప్రీతితో స్వీకరిస్తుంది. కాని ఆ పూలను భక్తితో సమర్పించాలి.

రకరకాల పూలతో అంటే మీకు అందుబాటులో ఉన్న వాటితో అమ్మను భక్తీ శ్రద్దలతో పూజించిన అమ్మవారు మన సమస్త కోరికలు తీర్చును. ప్రధానంగా అమ్మవారిని అంటే దుర్గా, సరస్వతి, లక్ష్మీ తదితర శ్రీమాతా స్వరూపాలను సంపెంగ, మల్లె, జాజి, తామర, కలువ, మరువం, దవనం మొదలగు పూలతో పూజించిన పుణ్యం నూరు రెట్లు అధికంగా వస్తుంది. అదేవిధంగా జాజి పూలతో భుక్తి, మల్లెతో లాభము, కమలము సుపుత్రులను,అమ్మవారిని ఒక నెల జపా పుష్పములచే పూజించిన అమ్మవారి అనుగ్రహము కలుగును.

తెల్లని పూలతో ఒక నెల పూజించిన ముప్పది జన్మల పాపం నశించును. మంకెన పూలతో ఒక నెల పూజించిన సర్వ పాపములు తొలగి పోవును తామర పూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసన్నబుద్ధితో పూజించిన అన్ని పాపములు నశించి రాజయోగం కలుగుతుంది. దీనితోపాటు మల్లె, జాజి, తెల్ల కలువ, తామరలతో ఒక నెల పూజించిన వంద జన్మల పాపం తొలగును. బ్రహ్మ హత్యా పాతకం తొలగును.

పూల మాలలో ఇవి ఉండకూడదు !
పూజించు పూల యందు వెంట్రుకలు ఉన్న మానసిక వ్యాధులు కలుగును. పురుగులు కలగిన పూలు ఉపయోగించిన రాజ దండనము, మహా భయము కలుగును. అందుకని అమ్మవారికి ప్రియమైన పూలను ఉపయోగించి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

ఏ పూజ చేసినా ఏ పూలు అర్పించినా భక్తి, శ్రద్ధ అనేవి అత్యంత ముఖ్యం దీనిగుర్తించి పూజ చేయాలి. అదేవిధంగా పైన చెప్పిన పూలు లేదా పుష్పాలు అందరికీ దొరకవు. అలాంటప్పుడు కలియుగ ధర్మం ప్రకారం వాటిని మానసికంగా దేవుడికి సమర్పించినట్లు భావించినా పైన చెప్పిన ఫలాలు కలుగును.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 5, 2021 at 8:20 సా.