Rudraksha రుద్రాక్ష.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వాటిలో రుద్రాక్షలు ఒకటి. సాక్షాత్తు శివ స్వరూపంగా వాటిని భావిస్తారు. ధరిస్తారు.
పురాణాలలో రుద్రాక్ష వివరణలు పరిశీలిస్తే … శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారణ్య మహాత్యం, దేవిభాగవతం, రుద్ర జాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం లాంటి అనేక గ్రంథములలో రుద్రాక్షలవివరణ ఉన్నది.
రుద్రాకారణ్యమహాత్యం ప్రకారం.. ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా శివుడి కన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి అందరి క్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు స్వయముగా చెప్పాడు. దీని గురించిన శ్లోకం
”స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్, భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్ లక్షంతు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్”
అని రుద్రాక్షమాల గురించి “జాబాలోపనిషత్”లో పేర్కొనబడింది.
రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.
ఎలాంటి రుద్రాక్షలు మంచివి ?
“ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే”
అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి. రుద్రాక్షలు ధరించే విధానం, వాటిని ధరించడం వల్ల కలిగే ఫలితాల గురించి మరోసారి తెలుసుకుందాం.