Sri Dattatreya Swamy Temple Vallabhapuram Kurvapuram : దత్తాత్రేయ క్షేత్రం కురుపురం !
దత్తాత్రేయుడు.. భక్తులను అనుగ్రహించే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్ని రకాల బాధలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. మనదేశంలో అనేక దత్తక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది.. కురుపురం. దీన్నే కురువాపురం, కురుంగడ్డ మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో వుంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం , కాని రాయచూర్ వెళ్ళే బస్సులో మెహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్ళాలి. ఆతరువాత అనుగొండ వెళ్ళే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గరలోనే కురుపురం చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రం లోని రాయ్ చూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్ళచ్చు.

ఇటైనా, అటైనా కృష్ణానది దాటాలి.
కురుపురం ఒక ద్వీపంలో వుంది. చుట్టూ కృష్ణానది. ఆనది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లితండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమ లెన్నిటినో చూపారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మ రూపులై వుంటారని భక్తుల నమ్మకం.

విశేషాలు..
ఈ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభుడు.. ఆశ్వీయుజమాస కృష్ణద్ద్వాదశి, హస్తా నక్షత్రం రోజున కృష్ణానదిలో వారు అంతర్దానమయ్యారు. శ్రీగురుచరిత్ర, శ్రీసాయిబాబాచరిత్ర, శ్రీవల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చరిత్ర, మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివేవారికి ఈ క్షేత్రం గురించి తెలుస్తుంది. ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటు వేపు సూర్యనమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని ఇక్కడి వారు చెప్తారు. అటు కర్నాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసుకునేవారు. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది.

శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం వున్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం వుంది. అదే కురుపురం (కురువాపురం). శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురాన్ని బుట్టీల (పుట్టీలు) ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు ఇది చాలా మహిమగల శ్రేత్రం. వెయ్యి సంవత్సరాల పైనే వయసు వున్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రివల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి వుంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దాని పైన వున్న శివాలయం దర్శించుకోవచ్చు.

కురు మహరాజుకు ఙ్ఞానోపదేశం అయిన ప్రాంతం కాబట్టి కురువపురమనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజూ అభిషేకం, పల్లకీసేవ జరుగుతాయి. శ్రీపాదశ్రీవల్లభుల జయంతి, దత్తజయంతి, వంటి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణానదిలో అంతర్థానమైన శ్రీపాదవల్లభుల గుప్తదినం (ఆశ్వీయుజ బహుళ ద్వాదశి), గురుద్వాదశి, (మాఘ బహుళ పాడ్యమి) శ్రీనృసింహ సరస్వతి గుప్తదినాలు కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తుల కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు.

దర్శించతగ్గ ప్రదేశాలు

పంచపహడ్..ఈ ప్రాంతంలో ఐదుగురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతం ఇది. పాండురంగస్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి, రాఘవేంద్రస్వామి, విఘ్నేశ్వరుడు. ఇంకా అనఘ దత్త దేవాలయం, ఒకే చోట వున్నాయి.

శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయస్వామి మహాసంస్థానపీఠము: ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. శ్రీపాద శ్రీ వల్లభుల దర్బార్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిగే ప్రాంతం ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తప్పసు చేసుకునేటప్పడు తన కమండలం ఆన్చిన రాయి (త్రిశూలం) కూడా వుంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
సత్రాలు.. వసతి !

కురుపురంలోను, రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉచిత రూములు వున్నాయి.. పంచదేవతాపహాడ్ దగ్గరలో శ్రీదత్తాత్రేయ స్పిరిచ్యువల్ సొసైటీ, శ్రీ పాద దత్తసాయి సొసైటీవారి అధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. అన్ని వసతులు, ఆధునిక కట్టడాలతో రూములు లభ్యమవుతున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 3, 2021 at 9:59 ఉద.