Acharya Movie Review : ‘ఆచార్య’ మూవీ రివ్యూ

Balu

మూవీ పేరు: ‘ఆచార్య
విడుదల తేదీ: 29-04-2022
నిడివి: 154 నిమిషాలు
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్, సత్యదేవ్ తదిరులు
ఆర్ట్: సురేష్ సెల్వరాజన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: మణిశర్మ
కెమెరా: ఎస్. తిరునవుక్కరసు
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
కథ-దర్శకత్వం: కొరటాల శివ

Acharya Movie Review : ‘ఆచార్య’ మూవీ రివ్యూ : 10 సంవత్సరాల పాటు రాజకీయాల బాట పట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీలో ఆయన దూకుడుకి యంగ్ హీరోలు, అభిమానులు, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వారందరినీ మరింత ఆశ్చర్యపరిచేలా తన తనయుడు రామ్ చరణ్‌తో సినిమా ప్లాన్ చేయడం, అదీ కూడా మాస్ పల్స్ బాగా తెలిసిన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ వంటి చిత్రం కావడంతో ఫ్యాన్సే కాకుండా ప్రేక్షకులందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ‘ఆచార్య’గా మారిన చిరంజీవి.. ఈ ‘ఆచార్య’ చిత్రంతో తన కొడుకుతో పోటీ పడుతుండటంతో.. సాధారణంగానే సినిమాపై క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అది చాలదన్నట్టు.. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రమోషన్స్, ట్రైలర్, సాంగ్ ప్రోమోస్ సినిమాపై ఏ స్థాయి అంచనాలు కావాలో.. ఆ స్థాయికి చేర్చేశాయి. రామ్ చరణ్ రీసెంట్‌గా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కనబరిచిన నటన గురించి ఇంకా జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు సిద్ధగా ఇంకెంతగా ఆకట్టుకుంటాడో అని ఒకవైపు.. మెగాస్టార్ స్పీడ్, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల మరోవైపు.. వెరసీ ఈ సినిమా భారీగా జనాల్లోకి వెళ్లిపోయింది. మరి ఇటువంటి అంచనాలు, క్రేజ్ మధ్య నేడు థియేటర్లలోకి వచ్చిన ‘ఆచార్య’ ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.

కథ

ధర్మస్థలి అనే గ్రామంలో పాదఘట్టంకి ఓ విశిష్టత ఉంటుంది. అక్కడి గురుకులంలో పెరిగిన సిద్ధ (రామ్ చరణ్).. ధర్మస్థలి గ్రామానికి, అక్కడి ప్రజలకి అండగా ఉంటాడు. ఏ ఆపద వచ్చినా రక్షిస్తుంటాడు. మైనింగ్ మాఫియాకి చెందిన బసవ(సోనూసూద్).. తనకున్న రాజకీయ పలుకుబడితో.. ఆ గ్రామాన్ని, పాదఘట్టాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటాడు. అందుకు సిద్ధ అడ్డుపడుతుంటారు. కానీ సిద్ధ ఆ గ్రామం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. సిద్ధ లేకపోవడం బసవ.. ఆ గ్రామాన్ని, పాదఘట్టాన్ని స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటాడు. పాదఘట్టాన్ని నాశనం చేయాలని చూస్తున్న తరుణంలో అక్కడికి ఆచార్య(చిరంజీవి) వస్తాడు. బసవకి అడ్డుగా నిలబడతాడు. అసలు ఈ ఆచార్య ఎవరు? ఎందుకు సిద్ధ ధర్మస్థలిని వదిలేయాల్సి వచ్చింది? సిద్ధ ఏమయ్యాడు? సిద్ధకి, ఆచార్యకి ఉన్న సంబంధం ఏమిటి? ధర్మస్థలిని, పాదఘట్టాన్ని బసవ బారి నుండి ఆచార్య ఎలా రక్షించాడు? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు

ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా చిరు తన స్పీడ్‌తో ఈ మధ్య అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన నటన చూసిన వారంతా కూడా అదే అనుకుంటారు. అంత వయసులో కూడా చిరు చేసిన డ్యాన్స్, ఫైట్స్ అలరిస్తాయి. ఇక కామ్రేడ్, ఆచార్యగా తన పాత్రలలో చిరు లీనమైన తీరు అందరినీ అలరిస్తుంది. ఇక తన కొడుకుతో చేసే సీన్లలో చిరు ఇచ్చిన పోటీని ప్రశంసించాల్సిందే. రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. కనిపించిన ప్రతీ సీన్‌లో చరణ్ తన మార్క్ కనబరిచాడు. చరణ్ కెరియర్‌లో గుర్తుండిపోయే పాత్రగా సిద్ధని కొరటాల మలిచాడు. పూజా హెగ్డే పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. కొన్ని సన్నివేశాలకే ఆమె పరిమితమైంది. విలన్‌గా సోనూసూద్ నటన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి పాత్రలకు అతనికి కొట్టిన పిండే. తనకిచ్చిన బసవ పాత్రకి సోనూసూద్ కరెక్ట్‌గా సరిపోయాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాల్లో సత్యదేవ్ కనిపిస్తాడు. అతని పాత్ర కూడా సినిమాకి కీలకమే. ఇంకా తనికెళ్ల భరణి, నాజర్, అజయ్, కిషోర్, వెన్నెల కిశోర్ వంటి వారికి తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికినా.. ఉన్నంతలో వారి నటనతో మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ అబ్బుర పరిచేలా ఉంది. ఈ విషయంలో ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్, అలాగే సినిమాటోగ్రాఫర్ తిరు అభినందనీయులు. వారి పనితనం సినిమా చూస్తున్న ప్రేక్షకులపై చక్కని ఇంపాక్ట్‌ని కలిగిస్తుంది. సురేష్ వేసిన సెట్స్.. రియల్‌గా అనిపిస్తాయి. దేవాలయం సెట్ అయితే అద్భుతం అని చెప్పవచ్చు. అలాగే తిరు కూడా తన కెమెరాతో ప్రకృతి అందాలను చక్కగా బంధించాడు. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కత్తెర పడాల్సిన సీన్లు ఉన్నాయి. ఫస్టాఫ్ సాగదీతగా అనిపించింది. ఇక మణిశర్మ సంగీతం పరంగా పాటలు చక్కగా కుదిరాయి. తెరపై కూడా వాటిని చక్కగా ఆవిష్కరించారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం మణిశర్మ తన మ్యాజిక్‌ని కనబరచలేకపోయారు. బహుశా.. ఇది థమన్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు. ఈ మధ్య థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవడంతో.. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఎలివేట్ కాలేదు. ఫైట్స్, డ్యాన్స్ విషయంలో ఆ శాఖకి సంబంధించిన వారు మంచి ఎఫర్ట్ పెట్టారు. సినిమా నిర్మాణం పరంగా నిర్మాతలు చాలా రిచ్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకత్వపరంగా కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం డిజప్పాయింట్ చేయదు కానీ.. కథ విషయంలోనే ప్రత్యేకంగా కొన్ని సీన్లు ఇరికించినట్లుగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

చిరు-చరణ్
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ డిజైనింగ్
పాటలు, ఫైట్స్

మైనస్ పాయింట్స్

కథ-కథనం
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
భావోద్వేగాలు లోపించడం

విశ్లేషణ

కొరటాల శివ సినిమాలంటే ఖచ్చితంగా హిట్ అనే టాక్‌ని.. ఆయన తీసిన కొన్ని సినిమాలతోనే సాధించుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో కొరటాల తన కథ, కథనాలను పక్కన పెట్టి.. చిరంజీవి, చరణ్‌లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. చరణ్ కోసం కొన్ని సీన్లను ఇరికించినట్లుగా కూడా అనిపించింది. స్టార్ హీరోలిద్దరి ఇమేజ్‌కి కావాల్సినవి జోడించే క్రమంలో.. కథపై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. 90ల నాటి కథలా అనిపించింది. కొరటాల ట్రీట్‌మెంట్ కూడా అలానే ఉంది. కాకపోతే టెంపుల్ టౌన్ అంశంతో సినిమాపై కాస్త ఆసక్తిని రేకెత్తించాడు. మహేష్ వాయిస్‌తో ధర్మస్థలిని పరిచయం చేసిన కొరటాల.. కథ మొత్తం దాని చుట్టూనే తిప్పారు. ఫస్టాఫ్ అంతా స్లో ఫేస్‌లో నడుస్తూ.. చూస్తున్న ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తున్న క్రమంలో ఇంటర్వెల్‌‌కి ముందు సిద్ధ పాత్రని తెరపైకి ఎక్కించాడు. ఇక సెకండాఫ్ అదిరిపోతుందిలే అనుకున్నట్లుగా ఇంటర్వెల్ కార్డ్ వేశాడు. ఇక సెకండాఫ్‌లో కాసేపు మెరుపులు మెరిపించినా.. అసలు కథ సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ ఎంటరవుతుంది. చిరు-చరణ్‌లని చూస్తూ మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం ఏంటిది? ఇలా నడుస్తుంది అనుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్‌ని తట్టుకోగలిగితే.. ఆచార్య సినిమా వందలో 90 శాతం నచ్చేసినట్లే. క్లైమాక్స్ కూడా అలరిస్తుంది. అయితే కమర్షియల్ అంశాలతో, గ్రాండియర్‌గా సినిమా ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కాలేరు. అది దర్శకత్వం లోపం అని చెప్పుకోవచ్చు. ఇక చిరు-చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సన్నివేశాలు మాత్రం ఫ్యాన్స్‌నే కాకుండా.. ప్రేక్షకులతో సైతం క్లాప్స్ కొట్టిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడా సన్నివేశాలే ఈ సినిమాని గట్టెక్కించాలి. మొత్తంగా చూస్తే మాత్రం.. మెగా ఫ్యాన్స్‌కి పండగ వంటి సినిమా అయితే.. కొరటాలకి మాత్రం ఇది గుణపాఠం వంటి సినిమా.

రేటింగ్: 2.75/5
ట్యాగ్‌లైన్: చిరు-చరణ్‌ల మ్యాజిక్కే కాపాడాలి

- Advertisement -