Ashok Galla డ్రగ్స్ వ్యవహారంలో మహేష్ బాబు మేనల్లుడు కూడా పోలీసులకి చిక్కాడా..?

Joythi R

Ashok Galla మొన్నటి రోజున హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ పబ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కస్టడీకి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో టాలీవుడ్ ప్రముఖ సింగర్ మరియు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ప్రముఖ నటుడు మరియు సినీ నిర్మాత నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా పోలీసులకు చిక్కింది. వీరితో పాటు పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖుల పిల్లలు కూడా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అయితే ఈ ఆకస్మిక తనిఖీల్లో పోలీసులకు చిక్కిన వారిలో ఇటీవలే హీరోగా పరిచయమైన యువ హీరో మరియు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా ఉన్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. కానీ అశోక్ గల్లా తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో తన పలుకుబడిని ఉపయోగించి అరెస్టు కాకుండా తన కొడుకుని విడిపించుకున్నాడని మరికొందరు ప్రచారాలు చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై అశోక్ గల్లా కుటుంబ సభ్యులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా పబ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించిన సమయంలో అశోక్ గల్లా అక్కడ లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని బహిరంగంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. దీంతో అశోక్ గల్లా పోలీసులకు చిక్కినట్లు వినిపిస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటుడు అశోక్ గల్లా తెలుగులో హీరో అనే చిత్రంలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరోవైపు నిన్నటి రోజున నిహారిక కొణిదెల పోలీసుల కౌన్సిలింగ్ కొరకు హాజరై బయటకు వస్తున్న సమయంలో తీసినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమె తండ్రి సినీ నటుడు మరియు నిర్మాత నాగబాబు స్పందించారు. ఇందులో భాగంగా నిహారిక విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారని తెలిపాడు. అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా తన కూతురు గురించి తప్పుడు ప్రచారాలు, అసత్య కథనాలు ప్రచారం చేయొద్దని తెలిపాడు. అలాగే ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాను బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

మరోవైపు పోలీసులు మాత్రం మాదక ద్రవ్యాల వినియోగంలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాకుండా ఎంత పలుకుబడి మరియు ఫేమ్ ఉన్న వాళ్ళయినా సరే తప్పు చేసినట్లు రుజువైతే శిక్ష తప్పదని అంటున్నారు. మరి ఈ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

- Advertisement -