Indrajaa తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ కమీడియన్ ఆలీ నటించగా, హీరోయిన్ గా వెటరన్ హీరోయిన్ ఇంద్రజ నటించింది. అమ్మ సెంటిమెంటుతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నటి ఇంద్రజకి కూడా యమలీల చిత్రం బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కాగా యమలీల చిత్రంలో నటించడానికంటే ముందుగా నటి ఇంద్రజ తెలుగు, మలయాళం చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ యమలీల చిత్రం మాత్రం నటి ఇంద్రజ సినీ కెరియర్ ని ఒక్కసారిగా మలుపు తెప్పింది.
అయితే తాజాగా నటి ఇంద్రజ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది .ఇందులో భాగంగా తన భర్త మరియు ప్రముఖ వ్యాపారవేత్త అబ్సర్ మహమ్మద్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అయితే తన భర్త ఇతర మతస్థుడు కావడంతో మొదట్లో తన తల్లిదండ్రులు తమ వివాహానికి అంగీకరించలేదని కొంతమేర ఎమోషనల్ అయింది. ఇక తమ పెళ్లి ఖర్చుల విషయం గురించి స్పందిస్తూ అతికొద్ది మంది సమక్షంలో తమ వివాహం జరగడంతో కేవలం 7500 మాత్రమే తమ పెళ్ళికి ఖర్చయిందని సరదాగా తెలిపింది.
అయితే పెళ్లయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఒకపక్క సినీ కెరియర్ మరోపక్క కుటుంబ బాధ్యతలు వంటివి బ్యాలెన్స్ కాకపోవడంతో సినిమాలకి పులిస్టాప్ పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ తన కూతురు పెద్దవడం అలాగే కుటుంబ సభ్యులు కూడా తమ ప్రేమ వివాహాన్ని అంగీకరించడం వంటి వాటితో మళ్లీ సినిమాలకి సమయం కేటాయించడానికి వీలు కుదిరిందని తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కారణం వల్లే తాను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాల్లో మరియు పలు రకాల షోలు, ఈవెంట్లలో నటిస్తూ బాగానే రాణిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా నటి ఇంద్రజ ఈ టీవీ ఛానల్ నిర్వహించే పలు రకాల షోలు, ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అమ్మ, అక్క, చెల్లి తదితర పాత్రలలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఏదేమైనప్పటికీ నటి ఇంద్రజకి ఫస్ట్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసి రాకపోయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం, ఇటు కెరియర్ పరంగా అటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.