Senior actress Sudha : తెలుగు చిత్రసీమలో ఎందరో నటీమణులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుకుకున్నారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్ యాక్టర్ సుధ. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. బాలనటిగా, కథానాయికగా, అత్తగా, అమ్మగా, అమ్మమ్మగా, వదినగా.. ఇలా ఎన్నెన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారామె. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు.
ఎమోషనల్ సీన్లతోపాటు పాత్ర ఔచిత్యాన్ని బట్టి కామెడీని పలికించడంలోనూ సుధ దిట్ట అనే చెప్పాలి. ఇక ఎంతో మంది హీరోలకు అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించిన అందరు కథానాయకుల అభిమానుల నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఒడిదొడుకులను చూశారు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధ చెప్పుకొచ్చారు. తాను డైమండ్ స్పూన్ తో పుట్టానని.. పెద్ద బంగ్లా, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా ఎంతో రాజసంగా బతికామన్నారు.
అప్పట్నుంచి ఆస్తి అంతా కరిగిపోయింది
‘మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టా. అందుకే అమృతం అనే అర్థం వచ్చేలా నాకు సుధ అనే పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, అంతస్థులు, ఐశ్వర్యం ఇలా అన్నీ చూశా. కానీ తమ్ముడు పుట్టిన కొన్నాళ్లకు నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం ప్రారంభమైంది. నేను ఆరో తరగతి చదివే సమయానికి అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్థాయి నుంచి ఏమీ లేని దీనస్థితికి చేరుకున్నాం’ అని సుధ పేర్కొన్నారు.
Senior actress Sudha :
‘అమ్మ థియేటర్ ఆర్టిస్టు కావడంతో నన్ను యాక్టింగ్ ఫీల్డ్ కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మా ఇంటికి వచ్చేవారు. చిన్నతనంలో సుఖసంతోషాలతోపాటు ఎన్నో కష్టాలు కూడా పడ్డాం. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ పెట్టడంతో డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయా. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడ్డా. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు’ అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు సుధ.