Parachuri Gopalakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ రచయితలుగా గుర్తింపు పొందిన పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి 300 సినిమాలకు పైగా రచయితలుగా పని చేశారు. అంతేకాకుండా వీరు ఎన్నో సినిమాలలో నటించి నటులుగా కూడా మంచి గుర్తింపు పొందారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలా నటులుగా, సినీ రచయితలుగా, దర్శకులుగా గుర్తింపు పొందిన పరుచూరి బ్రదర్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
ఇక పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇటీవల కాలంలో విడుదలైన సినిమా విశేషాల గురించి తన అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరుచూరి గోపాలకృష్ణ గతంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..’ శోభన్ బాబు హీరోగా నేను ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో అశ్వినీ దత్, దేవి ప్రసాద్, త్రివిక్రమ్ రావు తదుపరి సినిమా తమ బ్యానర్ లో చేయమని అడ్వాన్స్ ఇవ్వటానికి వచ్చారు అంటూ తెలిపాడు.
Parachuri Gopalakrishna: డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు…
కృష్ణ ,శోభన్ బాబు వంటి హీరోలతో సినిమా చేయమని డబ్బు కట్టలు నా ముందు పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు . ఆ సమయంలో ఆ డబ్బు తీసుకోమని సురేష్ బాబు నాకు చెప్పాడు. ఆ డబ్బు తీసుకోమని , శంకరపల్లిలో చెరో 50 ఎకరాలు స్థలం కొనిపెడతా అని సురేష్ బాబు చెప్పాడు. కానీ ఆ డబ్బు తీసుకోవడానికి మా అన్నయ్య అంగీకరించలేదు. వాడు డైరెక్టర్ అయితే నేను పిడేలు వాయించాలా? అని అన్నాడు. దీంతో మా అన్నకు ఇష్టం లేని పని నేను చేయలేదు. అయితే ఆరోజు ఆ డబ్బు కట్టలు తీసుకుని ఉంటే బాగుండేదని తర్వాత ఆయన చాలా బాధ పడ్డారు. ఇలా అన్నయ్య మాటకు విలువ ఇవ్వడం వల్ల 100 ఎకరాల ఆస్తి కోల్పోయాము అంటూ పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించాడు.