Saidharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘విరూపాక్ష ‘ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచాయి. అంతేకాకుండా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత మొదటిసారిగా నటించిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీ సమీపించడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ అండ్ టీం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేయడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో కూడా సందడి చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ తో తన సినిమా గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ” పవన్, మీరు కలిసి రీమేక్‌కు బదులు ఒరిజినల్ సినిమా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. అది పవన్‌కల్యాణ్ వరకూ చేరిందా?” అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ విషయం మామయ్య వరకు చేరిందని సమాధానమిచ్చారు సాయిధరమ్ తేజ్.
Saidharam Tej: స్క్రిప్టు మొత్తం మార్పులు చేశారు…
ఈమేరకు ఆయన మాట్లాడుతూ .”రీమేకా..? కాదా? అనే విషయాల్ని పక్కనపెడితే.. నన్ను పెంచి పెద్ద చేసిన ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అది నా డ్రీమ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. అయితే ‘ఈ సినిమా ఎందుకు? ఆ సినిమా ఎందుకు?’ అని చాలామంది అంటుంటారు. నేను అవేవీ పట్టించుకోను. మేం చేస్తున్న కథకు.. మాతృక సినిమా కథకు సంబంధం లేదు. మాతృకలోని సోల్ మాత్రమే తీసుకుని మిగిలిందంతా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు కథని పూర్తిగా మార్చేశారు” అంటూ సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు.