Chakri: తెలుగులో ఒకప్పుడు పలు సూపర్ హిట్ చిత్రాలకి సంగీత స్వరాలు సమకూర్చి అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే మంచి మెలోడీస్ లేదా సూపర్ కూల్ పాటలు అలాగే మైమరిపింపజేసే సంగీతాన్ని కంపోజ్ చెయ్యడం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి యొక్క స్పెషాలిటీ. కాగా చక్రి కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు సింగర్ గా కుడా తన గాత్రంతో బాగానే అలరించాడు.
అయితే వ్యక్తిగత జీవితంలో కూడా చక్రి పలు సేవా కార్యక్రమాలు అలాగే కష్టం అంటూ తన ఇంటికి వస్తే అడిగినంత సహాయం చేయడం వంటివి చేస్తుండేవాడు. కానీ దురదృష్టవశాత్తు 2014 సంవత్సరంలో గుండెపోటు సమస్యల కారణంగా మృతి చెందాడు. అయితే సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం అతడి కుటుంబ సభ్యులు అలాగే పిల్లలు, భార్య ఏమయ్యారు అనే విషయాలు దాదాపుగా తెలియవు. కాగా తాజాగా చక్రి సోదరుడు మహతి నారాయణ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇంటర్వ్యూ లో భాగంగా చాలామంది నిజానిజాలు తెలుసుకోకుండా చక్రి మరణాంతరం తమ కుటుంబం గురించి కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేశారని వాపోయాడు. ఈ క్రమంలో చక్రి మరియు తనకి జన్మనిచ్చిన తల్లి పై కూడా లేనిపోని అబండాలు, నిందలు వేస్తూ కథనాలు రాసారని ఎమోషనల్ అయ్యాడు. ఇక తన సోదరుడు చక్రి మరణాంతరం తన వదిన పిల్లలు తనతో ఉండట్లేదని అలాగే చక్రి మరణించిన కొద్ది రోజులకే వారు వేరు కాపురం పెట్టి వెళ్లిపోయారని తెలిపాడు. అలాగే ప్రస్తుతం తన వదినతో తమకు అంతగా సన్నిహిత సంబంధాలు లేవని కూడా తెలిపాడు. ఇక చక్రి మరణించిన తర్వాత తమ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైందని అలాగే ఎన్నో ఒడిదుడుకులతోపాటు ఆ విషాద సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన తల్లయితే ఏకంగా చక్రి గొంతు వింటే చాలు చాలా ఎమోషనల్ అయ్యేదని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా సంగీత దర్శకుడు చక్రి ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకునేవాడు. కానీ మితిమీరిన దానగుణం, అలాగే అలవాట్లు కారణంగా కుటుంబానికి పెద్దగా మిగిల్చిందేమీ లేదని కూడా సమాచారం. ఇక మహతి నారాయణ్ విషయానికొస్తే టాలీవుడ్ లో లవ్ యూ బంగారం, నేనో రకం మరియు మరిన్ని చిత్రాలకి సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు. కానీ చక్రి స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.