Honda Activa Electric Scooter : ప్రముఖ మోటర్ సైకిల్ బ్రాండ్ హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటీ రాబోతోంది. హోండా నుంచి రాబోయే తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ఈనేపథ్యంలో హోండా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం ఎక్కువ సేల్స్ ఉన్న హోండా యాక్టివా మోడల్ లో ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకొచ్చేందుకు హోండా ప్రయత్నాలు చేస్తోంది.
హోండా నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చే సంవత్సరం అంటే 2024 మార్చిలో లాంచ్ కానుంది. ఇంకా సంవత్సరం టైమ్ ఉంది. అయితే.. హోండా నుంచి ఎప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయా అని వాహన దారులు తెగ ఎదురు చూస్తున్నారు. దానికి కారణం.. హోండా వాహనాల మీద ప్రజలకు ఉన్న నమ్మకం. మరోవైపు భారత్ లో చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ ప్లాన్ రూపొందించి ఆ తర్వాత హోండా నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తామని హోండా ఇండియా సీఈవో అత్సుషి ఒగతా చెప్పుకొచ్చారు.
Honda Activa Electric Scooter : ఫిక్స్ డ్ బ్యాటరీతో రానున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటీ
హోండా నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ స్కూటీ.. ఫిక్స్ డ్ బ్యాటరీతో రానుంది. ఆ తర్వాత రాబోయే మోడల్.. స్వాపబుల్ బ్యాటరీతో రానుంది. వీటి చార్జింగ్ కోసం దేశ వ్యాప్తంగా సుమారు 6000 చార్జింగ్ స్టేషన్లను వినియోగించుకోనున్నట్టు హోండా ప్రకటించింది. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కాగానే సేల్స్ కూడా ప్రారంభిస్తామని ఒగతా అన్నారు. ఈ స్కూటీ టాప్ స్పీడ్ గంటకు 50 కిమీలు ఉంటుంది. కాగా.. ప్రస్తుతం భారత్ లో ఇప్పటికే పలు రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్స్ ను తీసుకొచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్, హీరో, టీవీఎస్, ఒకినావా, హోప్ లాంటి కంపెనీలు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్స్ ను తీసుకొచ్చాయి. వాటికి పోటీగా హోండా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతోంది. దీని ధర, ఇతర ఫీచర్స్ వివరాలను ఇంకా హోండా వెల్లడించలేదు.