Bogus Votes : ఓటు హక్కు అనేది మన హక్కు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. లేకపోతే మనం ఈ దేశ పౌరులమే కాదు. అలాగే.. ఇక్కడి ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. కొందరికి కుదరక, వీలు కాక ఓటు వేయరు. అటువంటి వాళ్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ.. అసలు ఓటు హక్కు ఉండి, వీలు కుదిరినా కూడా ఓటు వేయకుండా ఉంటారు కొందరు. ఎవరు వేస్తారులే అని లైట్ తీసుకుంటారు. కానీ.. అది చాలా తప్పు. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందే.
ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికల్లో బోగస్ ఓట్లు, రిగ్గింగ్ అనే పదాలను వినే ఉంటారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన వాళ్లలో చాలామంది ఇలాంటివి చూసే ఉంటారు. మీ ఓటు ఇప్పటికే వేశారు. మళ్లీ వేయడానికి కుదరదు అని అధికారులు చెబుతుంటారు. మీ ఓటు ఎవరు వేశారో తెలియదు. మీరు మాత్రం ఓటు వేయలేదు. చేతికి ఇంకు కూడా ఉండదు. కానీ.. మీ ఓటును వేరే వాళ్లు వేశారన్నమాట. దీన్నే రిగ్గింగ్ అంటారు.. లేదా బోగస్ ఓటు అంటారు. అంటే.. మీ ఓటును వేరే వాళ్లు వేసేయడం అన్నమాట. ఇలాంటి సమయాల్లో ఇక నాకు ఓటు వేసే భాగ్యం లేదు అని అనుకొని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ల కోసమే ఎన్నికల సంఘం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం 49పీ సెక్షన్ కింద కొన్ని నిబంధనలను రూపొందించింది.
Bogus Votes : మీ ఓటు వేరే వాళ్లు వేసినా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు
సెక్షన్ 49పీ నిబంధన ప్రకారం మీ ఓటును వేరే వాళ్లు వేసినా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మీ ఓటు వేరే వాళ్లు వేశారని తెలియగానే పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఓటర్ ఐడీ కార్డు, బూత్ స్లిప్ ఉంటే మీరే నిజమైన ఓటరు అని అధికారులు గుర్తిస్తారు. వెంటనే మీకు ఓటు వేసే హక్కును ఇస్తారు కానీ.. మీరు అందరిలా ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేసే అధికారాన్ని పొందలేరు.
ఇలాంటి వాళ్ల కోసం టెండర్డ్ ఓటు ఉంటుంది. ఈ విధానంలో మీరు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే బ్యాలెట్ విధానంలో ఓటు వేసే హక్కు మీకు ఇస్తారు. మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ లో మీకు నచ్చిన అభ్యర్థి మీద ఓటు వేశాక.. ఆ స్లిప్ ను ఎన్నికల అధికారికి ఇస్తే ఆ స్లిప్ ను ఆ అధికారి ప్రత్యేక కవర్ లో సీల్ చేస్తారు. అయితే.. ఆ ఓటు వల్ల మీకు పెద్దగా వచ్చేదేం ఉండదు. ఎందుకంటే కౌంటింగ్ సమయంలో మీ ఓటును అధికారులు లెక్కించరు. ఎన్నికల్లో గెలుపోటముల నిర్ణయం విషయంలో అసలు టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకోరు.
కౌంటింగ్ సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చినా కూడా ఈ టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అప్పుడు బొమ్మా బొరుసు విధానంలో గెలిచిన అభ్యర్థిని నిర్ణయిస్తారు. అయితే.. నాణేం ద్వారా అంటే బొమ్మ బొరుసు వేసి అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తే.. అందులో ఓడిపోయిన వ్యక్తి ఒకవేళ కోర్టుకు వెళ్తే అప్పుడు ఆ నియోజకవర్గంలో ఎన్ని టెండర్డ్ ఓట్లు నమోదు అయితే వాటిని అప్పుడు లెక్కిస్తారు.
అయితే.. టెండర్డ్ ఓట్లను లెక్కించే ముందు.. బోగస్ ఓట్లు ఎన్ని పోల్ అయ్యాయో లెక్కిస్తారు. వాటి కోసం సీల్డ్ ఫారం 17ఏ ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఓటు వేసిన వాళ్ల వివరాలు ఉంటాయి. ఆ ఫారం ద్వారా అసలు బోగస్ ఓట్లు ఎలా పోల్ అయ్యాయో తెలుసుకుంటారు. దాన్ని తొలగించి మళ్లీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తారు.