Open House : సాధారణంగా మీకు తెలియని ప్రాంతానికి వెళ్తే ఏం చేస్తారు. అక్కడ ఏదైనా హోటల్ లో లేదా హాస్టల్ లో దిగుతారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని లేట్ అయితే అక్కడే పడుకొని తెల్లారాక మళ్లీ మీ ప్రాంతానికి వెళ్లిపోతారు. ఎక్కడైనా సరే.. మనం చేసే పని ఇదే. కానీ.. ఈ ఇల్లు మాత్రం అందరిది. ఆ ఇంటి ముందు ఓపెన్ హౌస్.. అందరి ఇల్లు అనే బోర్డు కనిపిస్తుంది. అంటే ఎవ్వరైనా సరే.. ఆ ఇంటికి వెళ్లొచ్చు. అక్కడే ఉండొచ్చు. అక్కడే పడుకోవచ్చు. అక్కడే వండుకొని తినవచ్చు. రెస్ట్ తీసుకోవచ్చు. అక్కడే ఫ్రెష్ కూడా అవ్వొచ్చు. ఇది ఒకరకంగా చెప్పాలంటే మీ ఇల్లే. అక్కడికి ఎవరు వెళ్తే అది వాళ్ల ఇల్లే. నమ్మశక్యంగా లేదు కదా. కానీ మేము చెప్పేది నిజం.
ఈ ఇల్లు ఎక్కడుంది. అసలు ఈ ఇంటికి ఓపెన్ హౌస్ అని ఎందుకు పేరు పెట్టారు.. అసలేంటి దీని కథ అంటారా? పదండి.. వివరంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉంది. ఎవరైనా సరే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి, ఉండటానికి అనువుగా ఉంటుంది. ఆ ఇంట్లో లైబ్రరీ కూడా ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్ ను 2006 లో సూర్య ప్రకాష్ వింజమూరి, ఎస్వీ కామేశ్వరి అనే దంపతులు స్థాపించారు. తమ సొంత ఇంటినే ఇలా అందరి ఇల్లుగా మార్చేశారు.
Open House : రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు
ఈ ఇంటికి వచ్చేవాళ్లను ఎవ్వరిని కూడా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏ కులం, ఏ జాతి, ఏ మతం, ఏ ఊరు.. ఇలా ఏ విషయం కూడా అడగం.. అని 58 ఏళ్ల ప్రకాష్ చెప్పుకొచ్చారు. ఈ ఇంటికి ఎక్కువగా యూత్ వస్తుంటారు. ఆ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి. న్యూస్ పేపర్స్ ఉంటాయి. అక్కడే కాసేపు అవి చదువుకోవచ్చు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువగా ఈ ఇంటికి వచ్చి ఇక్కడే సాయంత్రం దాకా చదువుకొని వెళ్తుంటారు.
తొలి నుంచి సూర్య ప్రకాష్ దంపతులకు సామాజిక సేవ చేయడం అంటే ఇష్టం. వీళ్లు ఇద్దరూ వృత్తి రీత్యా డాక్టర్లు. 2001 నుంచి తమ సోషల్ సర్వీస్ ను కొనసాగిస్తున్నారు. 2006 లో ఈ ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు. రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఈ ఇంట్లో ఉండొచ్చు. ఈ ఇంట్లో ఉండే కిచెన్ లో అన్ని వస్తువులు ఉంటాయి. వండుకోవడానికి కూరగాయలు కూడా ఉంటాయి. ఆకలి వేస్తే కిచెన్ లోకి వెళ్లి వంట వండుకొని తినవచ్చు. ఎవ్వరూ ఏం అడగరు.
రీడింగ్ రూమ్, హాల్, లైబ్రరీ, స్టోర్ రూమ్, కిచెన్ రూమ్ ఉంటాయి. ఓపెన్ హౌస్ బయట కూడా ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చొని సేద తీరవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో డాక్టర్ దంపతుల క్లీనిక్ ఉంటుంది. ఈ క్లీనిక్ ద్వారా వచ్చే డబ్బులతో ఈ ఓపెన్ హౌస్ ను నడిపిస్తున్నారు డాక్టర్ దంపతులు.