సగటు ఆడపిల్లలాగే ఆమె జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. మంచి ఉద్యోగం పొంది అమ్మా,నాన్నల కష్టాలను తగ్గించాలను కుంది. పీజీ వరకు ఆటంకాలు లేకుండా చదివి. ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత సాధించింది. అదే సయయంలో పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు. భర్త అనారోగ్యంతో ఆమె కథ అడ్డం తిరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే…పోటీ పరీక్షలు రాస్తూ, ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. బతుకుతెరువు కోసం సంతల్లో కూరగాయలు కూడా అమ్మింది. ప్చ్ అది కూడా కలిసి రాలేదు.
ఇక గత్యంతరం లేక… జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది. పది వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఎమ్మెస్సీ చదివి స్వీపర్‌గా పనిచేస్తున్నందుకు రజని సిగ్గుపడటం లేదు. ‘వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే అయిదుగురం బతకాలి. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా అంటోంది రజని.
ఉన్నత చదువులు చదివి స్వీపర్ గా పనిచేస్తున్న విషయం మంత్రి కేటీఆర్ కు చేరింది. దీంతో ఆయన స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. స్వీపర్ గా పనిచేస్తున్న రజినినీతో మాట్లాడారు. ఆమె ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆమె జీహెచ్ఎంసీ డిపార్ట్ మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చొరవ తీసుకున్నారు.