Elections : రానున్నది ఎన్నికల కాలం. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఏపీలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరమే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. అసలు ఎన్నికల్లో ఎవరు ఓటేస్తారు. ఎవరు వేయరు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు పోటీ చేయరు. పోటీ చేయడానికి, ఓటేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటు వేయాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. ఓటు హక్కుకు నమోదు చేసుకొని ఉండాలి. ఓటరు లిస్టు పేరు వస్తే ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. అయితే.. ఓటరు లిస్టులో పేరు లేని వాళ్లు మాత్రం ఓటు వేయడానికి అర్హులు కారు. ఎన్నికల నేరానికి పాల్పడిన వ్యక్తికి ఓటు హక్కును తొలగిస్తారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు హక్కు ఉంటే వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేరు. విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయులు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేరు. మానసిక స్థితి సరిగ్గా లేని వారు, ఉన్మాదులుగా కోర్టులు గుర్తించినా వాళ్లు ఓటు వేసే హక్కును కోల్పోతారు. అలాంటి వారి ఓటరు గుర్తింపు కార్డును కూడా ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది.
Elections : ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఇవే
భారత పౌరుడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు. అలాగే.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 లోని సెక్షన్ 4డీ ప్రకారం పార్లమెంట్ ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు.
ఇదే చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఏదైనా కేసులో దోషిగా శిక్ష పడి పైకోర్టుకు అప్పీలుకు వెళ్లి కేసు విచారణ పూర్తికాకపోయినా, బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తులు కూడా అనర్హులు అవుతారు.
ఎన్నికల్లో ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేయలేరు. ఏదైనా ఒక పదవికి రాజీనామా చేస్తేనే మరో పదవికి పోటీ చేసే హక్కు ఉంటుంది. అలాగే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని ఏదైనా కోర్టు తీర్పు చెబితే వాళ్లు కూడా అనర్హులు అవుతారు.