YSR Cheyutha : ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇప్పటికే అవి అమలు కూడా ప్రారంభం అయింది. అంతే కాదు.. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా.. సరైన లబ్ధిదారులకే ఫలాలు అందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. వైఎస్సార్ చేయూత అనేది కూడా ఒక స్కీమ్. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి మాత్రం డబ్బులు వస్తాయి. అయితే.. ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా లబ్ధిదారులకు అందుతాయి. ఒక విడతలో రూ.18,750 ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద చేరాలనుకునే వాళ్ల వయసు 45 ఏళ్లు నిండాలి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఈ పథకానికి అర్హులు.
YSR Cheyutha : ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా నిర్ధారణ
ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా ఈ పథకానికి అర్హులుగా నిర్ధారిస్తారు. వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారు ఆధార్ కార్డుతో పాటు కుల ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు ఉండాలి. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి ఏదైనా బిజినెస్ చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కిరాణా షాపులు, గేదెలు, మేకల యూనిట్లు ఇలా ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఈ బిజినెస్ కోసం.. అమూల్, రిలయెన్స్, పీఅండ్జీ, ఐటీసీ లాంటి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలా ఆసక్తి ఉన్నవారికి చేయూతను అందిస్తోంది. ఈ పథకం కింద ఆసక్తి ఉన్నవాళ్లు https://navasakam.ap.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ స్కీమ్ ను గత సంవత్సరమే ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ఒక విడత డబ్బులు అర్హులైన వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటికే అప్లయి చేసుకున్న వాళ్లకు రెండో విడత డబ్బులు కూడా త్వరలోనే అకౌంట్ లో జమకానున్నాయి.