Mothers Day Special : మాతృత్వం ఒక వరం… బిడ్డకు జన్మ ఇవ్వడమే కాదు బిడ్డకు తొలి గురువు కూడా అమ్మే….అలాంటిది నేటితరం అమ్మ తన భాద్యతలు ఎలా చేస్తోంది…..!

S R

Mothers Day Special : అమ్మ తాను చావు అంచుల వరకు వెళ్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. నిజంగా ఒక మహిళకు బిడ్డకు జన్మ ఇవ్వడం పునర్జన్మే. ఇక అలాంటి ఒక పెద్ద గండానికి కూడా భయపడని అమ్మ నొప్పిని పంటి బిగువున అణచిపెట్టి బిడ్డను చూడగానే చిరునవ్వుగా మార్చేస్తుంది. ఇక ఆ బిడ్డను తన ప్రాణం కంటే ఎక్కువగా సాకుతుంది. ఎంతో సుకుమారంగా పెరిగిన, ఎంతో గారాబంగా, కఠినంగా పెరిగిన ఒక మహిళ తన బిడ్డ వచ్చాక మాత్రం అన్ని తన బిడ్డే అన్నట్టు పెంచుతుంది. పువ్వులా సున్నితంగా తన బిడ్డను చూసుకుంటుంది, తన బిడ్డకు హాని కలిగితే అంతే పోరాటము చేస్తుంది.

Mothers Day Special ప్రతి అమ్మా ఓ యోధురాలే…..

అమ్మ అంటే బిడ్డను కనడమే కాదు తన బిడ్డకు తొలి గురువు కూడా. తనకు పాలిచ్చి పెంచడమే కాదు పాలించడము తెలుసు. మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ బెనజీర్ బుట్టో జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్, జసిండా న్యూజీలాండ్ మాజీ ప్రెసిడెంట్, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఇలా ఎందరో…వీళ్లంతా శక్తి వంతమైన పరిపాలన అందించి ఆలనా పాలనే కాదు పరిపాలన కూడా చేయగలమని నిరూపించిన స్త్రీ మూర్తులు.

ఇక పరిపాలనే కాదు వ్యాపారం, సినిమా, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల్లోను మగవారికి ధీటుగా రానిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటు ఇంటిని చక్కపెడుతూ మరోపక్క ఉద్యోగము చేసే నేటి మహిళ పోరాట యోధురలే. మరి నేటి తరం మహిళలు ఈ బాధ్యతలను పరిపూర్ణంగా చేస్తోందా… నేటి ఆధునిక మహిళ సొంత కాళ్ళపై నిలబడి స్వాతంత్రంగా బతకాలనుకునే స్వాభిమానం ఉన్న మహిళ. తన కెరీర్ మొదట ఆ తరువాతే పెళ్లి, పిల్లలు అనుకునే ఈ తరం అమ్మాయిలు మరి కుటుంబం భాద్యతలను, తన కెరీర్ ను ఎలా బ్యాలన్స్ చేస్తోంది.

నేటి యువతరం అమ్మాయికి తన సొంత గుర్తింపు కోసం కష్టపడుతున్నారు ఇక పెళ్లయ్యాక పిల్లలు బాధ్యత ఇద్దరిది అనే భావన బాగా పెరిగింది ఇది ఒక రకంగా మంచి పరిణామమే అయిన తల్లి గా బిడ్డకు నేర్పాల్సిన ప్రాథమిక విషయాలను ఎందరు తల్లులు నేర్పుతున్నారు? పాశ్చాత్య పోకడల ప్రభావం నేటి యువత పై ఉంది. అయితే అందరూ ఒకేలా ఉంటారు అనడం లేదు ఇప్పటికి బిడ్డల కోసం తమ కలలను, కెరీర్ ను త్యాగం చేసి తమ బిడ్డల జీవితాలను వెలిగిస్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో మాత్రం తండ్రి తల్లిలా మారి బిడ్డ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఇది ఒక మంచి పరిణామం. అయితే కొందరు తల్లులు వారి కెరీర్ కోసం, తమ ఆనందాల కోసం పిల్లలను పట్టించుకోకపోవడం చూస్తున్నాము. అందుకే కంటేనే తల్లి కాదు.. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని పెంచే ఎవరైనా తల్లే మరి. ఒక బిడ్డకి ఏమి కావాలో తల్లికే తెలుసు మరి అలాంటి తల్లి ఒక మంచి పౌరుడిగా తన బిడ్డను తీర్చిదిద్దేంత ఓపిక, సమయం ఉన్నాయా… ఇది ఆలోచించాల్సిన విషయం ఒక సంఘం, ఒక దేశం బాగుండాలంటే ఆ దేశంలోని పౌరులు ఉన్నత భావాలు కలిగివుండాలి.. అది ఒక అమ్మ తన బిడ్డకు చిన్నతనంలోనే నేర్పే ఆదర్శ భావాలతోను, తండ్రి చూపే సరైన మార్గంలోనూ ఉంటుంది. కానీ ఒక తల్లికి తన బిడ్డ ఎపుడు అపురూపమే.

అల్లారుముద్దుగా అన్ని అమర్చి బాధ వస్తే తన చీర కొంగుతో కన్నీళ్లు తుడిచే అమ్మ, ఏ భయం వచ్చిన తన ఒళ్ళో బిడ్డను దాచుకునే అమ్మ… తన బిడ్డ చిన్న విజయానికి కూడా గొప్పగా సంబర పడిపోయే అమ్మ…మరి ఆ అమ్మకు మనం ఏమి ఇవ్వగలం ఏమి చేయగలం… ఒక వ్యక్తి గా సమాజంలో మంచి పేరు సాధించడం, తన జీవితంలోకి వచ్చే మరో మహిళకు గౌరవం ఇవ్వడం ఒక తల్లికి ఇచ్చే గొప్ప బహుమతి…తల్లి తన బిడ్డను ఎంత సున్నితంగా పెంచుతుందో… ఒడిదుడుకులు వస్తే పోరాడే ధైర్యము ఇవ్వాలి. ప్రతి తల్లి తన బిడ్డను ఒక యోధుడిలాగా…ఛత్రపతి శివాజీ లాగా తయారు చేయాలి… మాతృదినోత్సవం సందర్బంగా ప్రతి మాతృమూర్తికి, ప్రతి యోధురాలికి శుభాకాంక్షలు.

- Advertisement -