India – Pakistan Match భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంతో ఉత్కంఠ బరితంగా ఉంటుంది. అదీ ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో అయితే ఇంకా ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేం. ఈసారి కూడా టీ20 ప్రపంచకప్ 2021 లో పాక్‌తో భారత్ తలపడనుంది. అక్టోబర్ 24న జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ లోకం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ICC టీ20 ప్రపంచకప్ పోటీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 5 సార్లు మ్యాచ్ ఆడితే పాక్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. కాగా గతంలో ఇరు జట్లు ఆడిన మ్యాచ్ ఫలితాల గురించి మీకోసం…
టీ20 తొలి ప్రపంచకప్ లోనే భారత్-పాక్ మధ్య క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ జరిగింది. 2007 సెప్టెంబర్ 4న డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లీగ్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. ఇరు జట్లు స్కోర్లు సమం కాగా మ్యాచ్ బౌలౌట్‌కు దారి తీసింది. బౌలౌట్‌లో సెహ్వాగ్, భజ్జీ, ఉతప్ప వికెట్లను నేలకూల్చగా… పాకిస్థాన్ బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. దీంతో భారత్ 3-0 తేడాతో పాక్ పై గెలుపొందింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏకైక బౌలౌట్ ఇదే కావడం గమనార్హం.
ఇదే ప్రపంచకప్‌లో జోహనెస్బర్గ్ వేదికగా సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్ యావత్ దేశాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో భారత్ విజయనాదం చేసి తొలి టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో జోగిందర్ శర్మ వేసిన బంతిని మిస్బా ఉల్ హక్ స్కూప్ ఆడబోయి శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పాక్ రెండో సారి భారత్ చేతిలో పరాజయం పాలైంది.
టీ20 వరల్డ్ కప్‌లో 2012 సెప్టెంబర్ 30న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-పాక్ మూడోసారి తలపడ్డాయి. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌లో దాయాదిపై మూడో విజయం నమోదు చేసింది.
2014 మార్చి 21 బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా పాక్‌పై భారత్ మరో ఏకపక్ష విజయం నమోదు చేసింది. టీమ్ఇండియా దెబ్బకు పాక్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వగా భారత జట్టు తేలిగ్గా గెలిచింది.
2016 మార్చి 19న చివరిసారిగా కోల్‌కతాలో పాక్‌తో తలపడిన పోరులో భారత్ దుమ్ము రేపింది. పాక్‌ను 118 పరుగులకే కట్టడి చేసిన టీమ్ఇండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ అమీర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో సత్తా చాటాడు. ఈ విజయంతో దాయాదిపై టీ20 ప్రపంచకప్‌లలో భారత్ ఐదో విజయం నమోదు చేసింది.
ICC ఛాంపియన్స్ ట్రోపీలో మాత్రం భారత్ 2 సార్లు గెలవగా… పాక్ మూడుసార్లు విజయం సాధించింది. మొత్తంగా ICC టోర్నీలో భారత్- పాక్ 17 సార్లు తలపడగా.. 14 సార్లు టీమ్ఇండియా… 3 సార్లు పాక్ గెలిచాయి. భారతే ఫేవరెట్ ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతుండగా.. పాకిస్థాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. యూఏఈ, ఒమన్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతుండటం పాకిస్థాన్‌కు కలిసి వచ్చే విషయం. కాబట్టి పాక్ కి కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి. ఈ సారి జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.