Tollywood రవితేజ వర్సెస్ బెల్లంకొండ శ్రీనివాస్… ఒకే కధతో వస్తున్న ఇద్దరు హీరోలు

Jaya Kumar

Tollywood ఇద్దరు హీరోలు దాదాపు ఒకే స్టోరీ తో ఉన్న సినిమాలను లేదా ఒకే స్టోరీతో సినిమాలను తెరకెక్కించిన ఘటనలు చూశాం. అయితే ఇప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అదే జరుగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. దీంతో చిత్రసీమలో ఈ స్టోరీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలను గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దొంగ గురించి… ఆ సినిమాల గురించి ప్రత్యేకంగా మీకోసం.

1970 సంవత్సరంలో స్టూవర్టుపురం అనే ఊరిలో నాగేశ్వరరావు అనే పేరుమోసిన ఒక గజదొంగ ఉండేవాడు. అతను స్కెచ్ వేస్తే తిరుగుండదని… పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టేలా చోరీలు చేసేవాడు అని పేరుంది. అతని తెగువకు గాను ఆ ప్రాంత ప్రజలంతా ఆయనకు “టైగర్” అనే బిరుదు ఇచ్చారు. అధికారులకు చిక్కకుండా చాకచక్యంగా చిక్కినట్లే చిక్కి తప్పించుకునేవాడని మంచి టాక్ ఉంది. చెన్నై సెంట్రల్ జైలు నుంచి కూడా నాగేశ్వరరావు తప్పించుకున్నారని చెప్తున్నారు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే చాలా మందికి తెలుసని… ఆయన జీవితంలో అంతకుమించిన కోణాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. రాబిన్​హుడ్​ తరహాలో అతను దోచుకున్న సొమ్మును పేదలకు దానం చేసేవాడని అంటున్నారు. పలు కారణాల రీత్యా ఆయన చదువుకు దూరమయ్యారని.. అందుకనే అనేక మంది పిల్లల చదువుకు సాయం చేసేవాడని తెలిపారు.

అయితే నాగేశ్వరరావు జీవితం ఆధారంగా బెల్లం కొండ శ్రీనివాస్ కొంత కాలం క్రితం ఓ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి “స్టూవర్ట్ పురం దొంగ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు చిత్రా బృందం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీకి కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

కాగా మరో వైపు రవితేజ హీరోగా ఈరోజు వంశీ దర్శత్వంలో “టైగర్​ నాగేశ్వర్​రావు” చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్​, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా… అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. మరి ఈ వీరిద్దరిలో ఎవరు హిట్ కొడతారో… చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -