Hair Fall: ఇప్పుడు అందరినీ విపరీతంగా వేధిస్తున్న సమస్య జుట్టురాలడం. జుట్టు రాలడం అంటే భయపడని వారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో తమ జుట్టు ఎక్కువగా రాలిపోతోందని.. దానికి పరిష్కారమేమిటా అని టెన్షన్ పడుతూనే ఉంటారు. అయితే చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే.. మన జుట్టు సహజంగా కొంత రాలిపోతుంది. అంతకంటే ఎక్కువైతే మాత్రం దాన్ని ఇబ్బందే. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మొటిక్స్ ఇలా కారణాలేమైనా కావచ్చు వీటన్నింటి ఫలితం జుట్టు రాలిపోవడం.

Hair Fall Problems

దీని నివారణ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఫలితాలే అందరికీ ఒకేవిధంగా అందవు. అసలు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందామా..!

హార్మోన్ల అసమతౌల్యత

మన శరీరంలో తగ్గుముఖం పడుతున్న హార్మోన్ల సమతుల్యత మన ఫాలికల్స్‌ని సెన్సిటివ్‌గా మార్చి.. జుట్టు కుదుళ్లను వదులుగా మారేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. మెనోపాజ్, పీసీఓడీ, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వంటివి మన శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో మార్పులను కలిగించి జుట్టు రాలేలా చేస్తుంది.

జన్యుపరమైన కారణాలు

జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటివి సాధారణంగా జన్యుపరంగా ఎదురయ్యే సమస్యలే. తల్లిదండ్రులకు ఇలాంటి సమస్య ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బట్టతల అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉన్నా.. ఆడవారిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఒత్తిడి

ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది. ఒత్తిడి వల్ల జుట్టు ఫాలికల్స్ వదులుగా మారతాయి. డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు కూడా ఎదురై ఆఖరికి ఇవన్నీ కలిసి జుట్టు రాలడానికి దారి తీస్తాయి.

గర్భధారణ, ప్రసవం

గర్భధారణ సమయంలో ప్రసవం తర్వాత చాలామందికి హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ సమయంలో డీహైడ్రేషన్, అలసట వంటివి ఎదురవుతుంటాయి. ఇవి జుట్టు ఫాలికిల్స్‌ని వదులుగా చేసి జుట్టు రాలేలా చేస్తాయి.

ఆహార లోపం

మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్లు తక్కువగా ఉండడం వల్ల జుట్టుకి పోషకాలు అందడం కూడా తక్కువవుతుంది. దీంతో జుట్టు బలహీనంగా మారి తెగి రాలిపోతుంది.

రక్తహీనత

శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తస్రావం, ఐరన్ లెవెల్ తగ్గడం వంటివి జరిగినప్పుడు శరీరంలో అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతుంటాయి. ఇవన్నీ రక్తహీనతకు దారితీస్తాయి.

జుట్టురాలకుండా వంటింటి చిట్కాలు..

గ్రీన్ టీతో ప్రయత్నించండి 

గ్రీన్ టీ తాగడంతో పాటు తలకు ప్యాక్‌లా పట్టించడం వల్ల కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం నాలుగైదు గ్రీన్ టీ బ్యాగ్‌ల‌ను.. అర‌లీట‌ర్ నీటిలో వేసి వేడి చేసి ఆ త‌ర్వాత చ‌ల్లారిన నీటిని పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలను తడుపుకొని పది నిమిషాల పాటు ఉండి.. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండిష‌న‌ర్‌గా ప‌నిచేస్తుంది.

మందార హెయిర్ ప్యాక్

దీనికోసం ముందుగా మందార పూలను రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. నలిపితే పొడిగా మారేవరకూ.. అలా ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో.. ఓ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ కలపాలి. ఇందులో రోజ్ మేరీ ఎస్సెన్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది పింక్ రంగులోకి మారిన తర్వాత దీన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

కరివేపాకుతో..

పావులీటర్ కొబ్బరి నూనె తీసుకొని దాన్ని మందపాటి అడుగున్న పాత్రలో పోసి అందులో కరివేపాకు రెబ్బలను వేయాలి. స్టవ్ వెలిగించి ఈ నూనెను కొన్ని నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. నూనె మొత్తం ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత దాన్ని దింపేయాలి. ఈ నూనెను రెండు రోజులకోసారి తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

ఉల్లిపాయ రసంతో.. 

ఉల్లిపాయ రసం జుట్టు పెరిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. కానీ ఇది ఎక్కువ మోతాదులో లభించదు. కాబట్టి ఈ ఉల్లిపాయ రసాన్ని కలబంద గుజ్జు, కొబ్బరి నూనెలతో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత అరగంట పాటు అలాగే ఉంచుకొని తలస్నానం చేసేయవచ్చు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 27, 2021 at 10:59 ఉద.