Cinnamon: నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ వేధిస్తోన్న సమస్య మధుమేహం. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి జీవనశైలిలో లేకపోవడం వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ అవుతోంది. ఇలాంటి వ్యాధికి వంటింట్లోనే మంచి చిట్కా మందు ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క డయాబెటిస్ రోగులకు ఒక అద్భుత ఔషధమని.. ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చిన వరమని నిపుణులు అంటున్నారు. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా..!

Cinnamon

వంటల్లో వాడే దాల్చిన చెక్కకు మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందంటున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు వారి రక్తంలోని చక్కెర స్థాయిని బాలెన్స్‌చేసుకుకోవడాని మందులు, ఇన్సులిన్ తీసుకుంటుంటారు. ఇది కాకుండా ఆహారం సహాయంతో కూడా దీనిని అదుపులో ఉంచవచ్చు. దాల్చిన చెక్క అనేది ప్రతి భారతీయ వంటగదిలో సాధారణంగా కనిపించే ఒక మసాలా దినుసు. దాల్చినచెక్క ఆహారాన్ని రుచికరంగా మార్చడంలోనే కాదు మనకు పోషకాలను కూడా పుష్కలంగా అందిస్తుంది.

అంతేకాదు.. టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అందుకే టైప్ -2 రకం డయాబెటిస్‌తో బాధపడేవాళ్లకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇందులోని ఔషధ గుణాలు ఎంతో సహాయపడతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. అందుకే డయాబెటిస్, దాల్చినచెక్కల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుందట. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

వివిధ రకాల వ్యాధుల నివారణలో దాల్చిన చెక్క..

రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు. దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. విరేచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ త్రాగితే బాక్టీరియా చనిపోయి, అజీర్ణం తగ్గి, ఆరోగ్యం బాగుపడుతుంది.

సౌందర్య సాధనంగా..

వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ను శరీరం నుండి తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ప్రభావవంతమైన ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకే చాలా రకాల నూనెల్లో దాల్చిన చెక్క ఎక్స్ట్రాక్ట్ను కలుపుతున్నారు. అలాగే ఫేస్ మాస్క్, స్క్రబ్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, తేమగా, అందంగా మార్చుతుంది.

దాల్చిన చెక్కతో నష్టాలు కూడా..

అయితే దీనిని అధికంగా వాడటం కూడా ఆరోగ్యానికి ముప్పేనని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. నోటి పూత, రక్తంలో తక్కువ గ్లూకోజ్, శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకుని వాడాలని చెబుతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 24, 2021 at 12:11 ఉద.