Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నం లేదా బ్యాక్టీరియా చేరినా పాడైపోని తినదగిన అన్నమే చద్దన్నం. ఇది వంటికి చలువ చేస్తుందని అంటారు. కొంతమంది ఈ చద్దన్నంలో పెరుగు కలుపుకొని పొద్దున్నే తింటుంటారు. ఈ అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని భావిస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఆ అనారోగ్య సమస్యలు, ఆరోగ్యప్రయోజనలేంటో చూసేద్దాం రండి..

అన్నం పులియబెటితే అన్నీ రెట్టింపే…

అన్నాన్ని రాత్రంతా పెరుగులో లేదా మజ్జిగలో పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందని అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చేసిన ప‌రిశోధ‌న ప్ర‌కారం వెల్లడైంది. వండిన అన్నంతో పోల్చితే.. 60శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్‌ 21 శాతం ఎక్కువ ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్లలో బి12-విటమిన్‌ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు.

Fermented Rice | Immunity Booster | Probiotic Curd Rice

చద్దన్నంతో అనారోగ్య సమస్యలకు చెక్‌..

ఇది బలవర్థకమైన ఆహారమనీ రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ అంటారు. రక్తహీనత నివారిస్తూ, దంతాలు, ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అల్సర్లూ, పేగు సమస్యలు ఉన్నవాళ్లకి పరమౌషధంలా పనిచేస్తుందని అంటున్నారు. చద్దన్నంలో ఉండే పోషకాలు.. చర్మ సమస్యలు, ఎలర్జీలు, ఎగ్జిమా, దురద వంటి వాటిని దూరంగా ఉంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉత్సాహంగా ఉండటానికి ఈ చద్దన్నం సహాయపడుతుందంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే.. ఈ చద్దన్నాన్ని వేసవికాలంలో తినడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉంటామని పెద్దలు చెప్తున్నారు.. జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని ఈ చద్దన్నం హరించేస్తుందట. మతిమరుపు, ఆల్జీమర్స్‌, బుద్ధిమాంద్యం.. వంటి సమస్యల్ని నిలువరిస్తుందని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

సర్వేలు ఏం చెప్తున్నాయంటే..

నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇచ్చిన నివేదికలో భాగంగా రాత్రి మిగిలిపోయిన అన్నం మరుసటి రోజు తినడం వల్ల అది హానికరమైన ఆహారంగా మారుతుందంటున్నారు. ఒకసారి వండిన అన్నం కొన్ని గంటల తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే ఆ అన్నం బ్యాక్టీరియాగా మారిపోతుందని, ఇలాంటి అన్నం తినడం వల్ల వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని కేవలం రెండు గంటల వ్యవధిలో మాత్రమే తినాలని చెప్తున్నారు.

ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం ఎన్ని రోజులు తినొచ్చు..

ఒకవేళ అన్నం ఎక్కువగా మిగిలితే దానిని మనం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతాం అయితే ఇలా నిల్వ చేసిన అన్నం ఒక రోజుకు మించి ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచి తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఆహారపదార్ధాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేస్తే పాడవదని… ఎప్పుడైనా తినొచ్చు అని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికప్పుడు చక్కగా వండుకుని వేడివేడి అన్నాన్ని తినేలా ప్లాన్‌ చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.