Migraine Headache : పార్స్వ తలనొప్పి గురించి తెలుసా… తరచూ బాధించే ఈ తలనొప్పికి కారణాలేమిటి….!

S R

Migraine Headache : సాధారణంగా తలనొప్పిని ఎక్కువగా పట్టించుకోరు. అయితే తరచూ తలనొప్పి బాధిస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ప్రస్తుత జీవనశైలి వల్ల ఒత్తిడి, నిద్రలేమి, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ చూడటం, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం, ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడటం వంటివి తల నొప్పి రావడానికి కారణాలు. ఇక తలనొప్పిలో చాలా రకాలు ఉన్నాయి. సాధారణ తలనొప్పి నుదురు మీద నొప్పిగా మొదలై కాసేపటికి తగ్గిపోవచ్చు తరచూ రాదు .

ఇక అర తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి గా పిలవబడే నొప్పితో చాలా మంది ఇప్పటి యువతరం బాధపడుతున్నారు. 30ఏళ్ల లోపు వాళ్ళలో ఒత్తిడి మూలంగా ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి వస్తోంది. ఈ తలనొప్పి సాధారణంగా ఒత్తిడి, నిద్రలేమి, జీవన సరళిలో మార్పుల వల్ల వస్తుంది. చాలా వరకు విద్యార్థులలో ఈ తలనొప్పిని గమనించవచ్చు వారిలో ఉండే పోటీతత్వం వల్ల ఒత్తిడికి లోనవడం ఎక్కువ సేపు ఫోన్ తెరను చూడటం దీనికి కారణం. ప్రతి ఏడుగురిలో ఒకరు మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Migrane headache మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు…..

పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. జన్యు పరమైన కారణాలు కొంత మందిలో మైగ్రేన్ కు కారణం కావచ్చు. తలలోని నరాలు వాయడం వల్ల రక్తం సరిగా ఆ నరాల్లో ఆడకపోవడంవల్ల ఒకవైపు తలనొప్పి వస్తుంది. ఇక కొన్నిసార్లు రెండూవైపులా తలనొప్పి రావొచ్చు. తలనొప్పి వస్తున్నపుడు వాంతులు అవడం, ఆ వైపు కన్ను కూడా నొప్పించడం,తలలో కొట్టుకుంటున్నట్లుగా, నొప్పి వస్తూ పోతూ ఉన్నట్లుగా, తగ్గుతూ తీవ్రమవుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ఎండలో ఎక్కువ తిరిగినా, భోజనం చేయడంలో ఆలస్యమైన లేక తినకపోయినా నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఈ తలనొప్పి రావొచ్చు. ఇక ఈ తలనొప్పికి మరో ముఖ్యం కారణం ఒత్తిడికి గురవ్వడం, అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాన్నీ అదే పనిగా ఆలోచించడం, మానసిక ఆందోళన.

ఇక స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, రుతుక్రమం సరిగాలేకపోవడం, గర్భధారణ సమయంలో లేక మోనోపాజ్ సమయంలో ఇలా స్త్రీలలో మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అర తలనొప్పి వచ్చిన మొదటి దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పు రావడం, వాసన, వెలుతురు పడకపోవటం, కళ్ళు వెలుతురు చూసినపుడు తలనొప్పి ఎక్కువ అవడం మెడనొప్పి ఉంటాయి. రెండో దశలో చూపు మందగించడం, జిగ్‌జాగ్‌ లైన్స్‌ కనిపించడం, తలలో సూదులు గుచ్చినట్లు నొప్పి కలుగుతుంది. మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉంటాయి. మూడో దశలో తలనొప్పి రెండు గంటల నుంచి మూడు రోజులపాటు ఉండొచ్చు. వాంతులు ఉంటాయి. నొప్పి ఒక వైపు ఉంటుంది. కాంతిని చూసినా, శబ్దాలు విన్నా చికాకు పుడుతుంది. నాలుగో దశలో తలనొప్పి తగ్గిన తర్వాత కొద్ది రోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.

ఇక తలనొప్పి మొదటి దశలోనే డాక్టరును సంప్రదిస్తే మందులను ఇస్తారు. ఈ దశలో మందులను వాడటం వల్ల మైగ్రేన్ తగ్గిపోవచ్చు. రక్తం పరీక్షలు, బీపీ, ఈసీజీ, సీ టీ స్కానింగ్, ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇక మైగ్రేన్ నొప్పి మొదటి దశలోనే తగ్గించుకోడానికి జీవన సరళిలో మార్పులు అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, సరైన సమయంలో భోజనం చేయడం, నిద్రపోవడం, యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి అనుసరించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇక నొప్పి వచ్చినపుడు కాంతి లేనిచోట , నిశ్శబ్దం ఉన్న ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోయిన ఉపశమనం లభిస్తుంది. ఇక నొప్పి తీవ్రత అధికమైనా, తరచూ వస్తున్న డాక్టరును సంప్రదించి మందులు వాడాలి.

- Advertisement -