Post Covid Diet: కరోనా తగ్గినా ఇంకా నీరసంగా, అలసటగా ఉందా..? అయితే ఈ డైట్‌ ఫాలో అవ్వండి..!

Raja J

Post Covid Diet: కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా జబ్బు ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం.. నీరసం, అలసట అలాగే ఉంటుండం వంటి లక్షణాలు ఇంకొంత ఆందోళనకు దారితీస్తున్నాయి. అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అసలు కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా డైట్‌ తీసుకోవాలా అంటే వైద్యనిపుణులు అవును అనే అంటున్నారు.

కరోనా తర్వాత పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఒక రోగికి ఆరు నుంచి ఎనిమిది మాసాలు పడుతుందని వైద్యుల అంచనా. ఎలాంటి దుష్ప్రభావాలూ, లక్షణాలూ లేకుండా కరోనా బారిన పడ్డవారి నుంచి మొదలుకుని… ఇటు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నవారు… భౌతికంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాల్సిందే అని చెప్తున్నారు. పోస్ట్ కోవిడ్‌(కరోనా వచ్చి తగ్గిన) రోగులు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలో చూద్దామా మరి..!

శరీరానికి కావాల్సిన అతిముఖ్యమైన ద్రవం నీరు. చాలామంది రోజువారీ పనుల్లో పడి నీళ్లు తాగాలన్న విషయాన్నే మర్చిపోతారు. కానీ, నీళ్లు చాలినంతగా తాగకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. జీర్ణక్రియలో, శోషణలో, పోషక విలువలను ఉపయోగించుకోవడంలో శరీరానికి నీరే ఆధారం.
అసలే వేసవి కావడంతో శరీరంలో వాటల్ లెవల్స్ పడిపోకుండా తగిన మోతాదులో గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయి తరచుగా అలసటబారినపడతారు.

ఉదయం పండ్లముక్కలు లేదా పండ్లరసాలు తీసుకుంటే నీరసం తగ్గుతుంది. అలాగే, తాజా కూరగాయలను మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే ప్రొటీన్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, త్వరగా కోలుకునేలా చేస్తాయి. అవసరమైతే డాక్టర్‌ని సంప్రదించి రోగ నిరోధక శక్తిని పెంచే మల్టీ విటమిన్‌ మాత్రలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామం చేయాలి.

★ శక్తినిచ్చే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజాలు సరిపడా తీసుకుంటేనే తొందరగా కోలుకోవచ్చు.
★ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పాలు తీసుకోవాలి.
★ అల్పాహారంగా రాగి మాల్ట్ మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు.
★ ఉడికించిన గుడ్డు రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవడం మేలు.
★ కరోనా బారిన పడని వారికి కోలుకున్న వారికి విటమిన్ సి ఎంతో కీలకం.
★ అందుకే సిట్రస్ జాతి పండ్లు అయిన నిమ్మ ఆరెంజ్ ను కచ్చితంగా తీసుకోవాలి.
★ విటమిన్ సి లభించే క్యాప్సికం బ్రోకోలి క్యారెట్ పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవాలి.
★ వేడి నీళ్లలో తేనె నిమ్మరసం వేసి తీసుకుంటే సమృద్ధిగా విటమిన్ సి లభిస్తుంది.
★ మధ్యాహ్న భోజనంలో రొట్టె చేర్చాలి.
★ పప్పు ఆకుకూరలు విటమిన్ సి లభించే కూరగాయలు చికెన్ చేప తీసుకోవచ్చు.
★ సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఉడికించిన పల్లీలు శనగలు వేయించిన బఠానీలు నానబెట్టిన బాదం బొబ్బర్లు అలసందలు పెసలు తీసుకోవచ్చు.
★ ఈ పప్పు ధాన్యాలతో శక్తితో పాటు ప్రోటీన్లు ఐరన్ జింక్ వివిధ విటమిన్లు లభిస్తాయి.
★ నీరసంగా ఉన్నవారు మాంసకృత్తులు అధికంగా లభించే నువ్వులను బాగా వాడాలి.
★ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా మేలే.
★ విటమిన్ సి ఉండే పండ్లు కివి, బొప్పాయి తీసుకోవాలి.
★ ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడ్డవారు తొందరగా కోల్పోవచ్చు.
★ వీటన్నిటికంటే కీలకమైనవి సమయానికి తినడం, సరిపడా నిద్రపోవడం

- Advertisement -