Rainy Season: వర్షాకాలం మొదలవగానే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం మొదలవ్వగానే వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆహార పదార్థాలు ఏమిటో చూసేద్దామా..!

వానా కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారాన్ని తినడం మానుకోని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తింటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

    • వర్షాకాలం మొదలవగానే చాలామంది బజ్జీలు, పకోడీలు వంటి ఆహార పదార్ధాలను తినడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
    • వర్షా కాలంలో హెర్బల్ టీ లేదా కషాయాలను తాగ‌డం ద్వారా మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుప‌డుతుంది. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.
Herbal Tea for Good Health in Rainy Season
  • ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  • నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని ర‌క్షిస్తుంది. అంతేకాకుండా నిమ్మ‌కాయ‌తో రోగనిరోధక శక్తి కూడా అమితంగా పెరుగుతుంది.
  • వర్షాకాలంలో సలాడ్లు తీసుకోవడం మానేయాలి. అలాగే చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోవడం మానేయాలి. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై చూపుతుంది. కనుక ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే మన ఇంటి ఆవరణ చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కడ నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా ఆపవచ్చు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 9, 2021 at 12:00 ఉద.