Zika Virus Symptons

Zika Virus: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండగా, ప్రస్తుతం జికా వైరస్ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసు వెలుగుచూడటం వల్ల  ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జికా వైరస్ అంటే ఏమిటి? ఈ మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. వాటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

Zika Virus Symptons

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్నవేళ.. కేరళ రాష్ట్రంలోని 24 సంవత్సరాల గర్భిణీకి జికా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ వైరస్‌ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల్లాగే జికా వైరస్ కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు.

జికా వైరస్ ప్రధానంగా ఏడెస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను గుర్తించడం కొంచెం కష్టతరమవుతుందని వైద్యులు తెలిపారు.  ఈ వైరస్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించడం వల్ల సాధారణ ఫ్లూ అని భావిస్తారు.

వైరస్‌ లక్షణాలు:

జికా వైరస్ సోకినప్పుడు జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం వంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ లక్షణాలు ఒక వారంలో నయం కాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కొందరికి కళ్ళలో నీళ్లు కారడం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు కూడా వస్తాయి. వైరస్ మన శరీరంలో వ్యాప్తి చెంది మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్‌కి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా గర్భిణిలకు ఈ వైరస్‌ సోకితే.. వారికి పుట్టే పిల్లలకు ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. వారి మెదడు ఎదుగుదలపై  మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.

తొలిసారి ఉగాండాలో

వాస్తవానికి జికా వైరస్‌ కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. 1947లో ఈస్ట్‌ ఆఫ్రికన్‌ వైరస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఉగాండాలో ఈ వైరస్‌ను గుర్తించారు. 1952లో ఓ కోతిలో జికా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అయితే ఈ వ్యాధి మనుషులకు వ్యాపించదని భావించారు. అయితే, 1954లో నైజీరియాలో తొలిసారి ఓ వ్యక్తిలో జికా వైరస్‌ లక్షణాలు గుర్తించారు.

అంత ప్రమాదం కానప్పటికీ:

ప్రస్తుతం వర్షాకాలం కారణంగా దోమల వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జికా వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ అంత ప్రమాదం కానప్పటికి, ఎటువంటి టీకా లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కూడా ముంచుకొస్తున్న తరుణంలో జికా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 14, 2021 at 3:18 సా.