Roja: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. నేటికీ వైసీపీ పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అవుతుంది. వైసీపీ నాయకులు రాష్ట్రమొత్తం వైసీపీ జెండాలను ఎగురవేస్తూ జగన్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. భజన చెయ్యడంలో అందరికంటే ముందు వరుసలో పర్యాటకశాఖ మంత్రి రోజా ఉంటారు కాబట్టి ఇప్పుడు టీడీపీ నాయకుడైనా చంద్రబాబు నాయుడుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించారని రోజా తెలిపారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటిని తట్టుకొని నిలబడి ఈరోజు రాష్ట్రానికి సీఎం అయ్యారని, ఆయన పాలనలో రాజన్న రాజ్యం వచ్చిందని తెలిపారు.

జగనంటే బాబుకు వణుకు

సొంతంగా పార్టీ పెట్టిన జగన్ ను ఇబ్బంది పెట్టడానికి చాల ప్రయత్నాలు చేశారని, వారిలో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ కూడా ఉన్నారని, ఆమెనే జగన్ పేరు చెప్తే భయపడుతోందని, ఆమె జగన్ పై అక్రమ కేసులు పెట్టి, జగన్ ను జైలుకు పంపారని రోజా తెలిపారు. జగన్ పేరు చెప్తే వెన్నుపోటు వీరుడైన చంద్రబాబు నాయుడుకు వణుకుపడుతుందని, టీడీపీని ఎప్పటికైనా భూస్థాపితం చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని రోజా అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని, అలాంటి వాళ్ళు ఇప్పుడు బాబు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు.

తండ్రి ఆశయాల కోసం పార్టీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టారని, ఇప్పుడు ఆ ఆశయాలతోనే వైసీపీ పార్టీని జగన్ నడిపిస్తున్నారని రోజా భజన చేశారు. తండ్రి ఆశయ సాధనలో ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయలేదని, అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైలులో పెట్టినా, కత్తితో దాడి చేసినా.. అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తూ లెక్కచేయలేదని, తన గమ్యాన్ని చేరుకున్నారని రోజా వివరించారు. జగన్ ఓ పోరాట యోధుడని రోజా అభివర్ణించారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఆయనను ఆశీర్వదించారని, 151 సీట్లతో ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచేది వైసీపీనేనని రోజా ధీమా వ్యక్తం చేశారు.