Different love story: కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగుచూసింది. ఈ లవ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హసన్ జిల్లాలోని సకలేశపుర గ్రామానికి చెందిన ఓ 27 ఏండ్ల యువకుడు ఒకరి తెలియకుండా ఒకరిని ఇద్దరు యువతులను ప్రేమించాడు. దాంతో ఆ యువతులు ఇద్దరూ అతనిపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు ఒక రోజు ఓ యువతితో ఉండగా అతడి సమీప బంధువు చూశాడు. విషయాన్ని యువకుడి ఇంట్లో చెప్పాడు.
దాంతో ఆ యువకుడిని అతని కుటుంసభ్యులు నిలదీశారు. అందుకు ఆ యువకుడు తాను ఆ యువతిని ప్రేమించానని, పెండ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అతడి సమాధానంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి పెండ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ యువకుడు ప్రేమించిన వాళ్లలో ఒక యువతి విషయం తెలుసుకుని తన తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటిమీదకు వచ్చింది. తనను ప్రేమించి మరో యువతిని పెండ్లి ఎలా చేసుకుంటాడని నిలదీసింది.
అయితే, యువకుడి కుటుంబసభ్యులు అవమానించడంతో ఆమె విషం సేవించి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ఇంతలో ఆ నోటా ఈ నోటా ఆ యువకుడు ప్రేమించిన మరో యువతికి కూడా విషయం తెలిసిపోయింది. దాంతో ఆమె కూడా తన పేరెంట్స్‌తో కలిసి ఇంటి మీదకు వచ్చింది. ఆమె కూడా తనను ప్రేమించి మోసం చేశావని, పెండ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని తెగేసి చెప్పింది. దాంతో వివాదం ఊరి పెద్దల మధ్యకు చేరింది.
Different love story: మోసగించిన యువకుడికి వివాహం.. ప్రేమించిన యువతికి అన్యాయం
దాంతో గ్రామ పెద్దలు మూడు కుటుంబాల వారిని పిలిపించి ఊళ్లో పంచాయితీ పెట్టారు. వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత.. తమకు తాముగా ఏ ఒక్క యువతిని పెండ్లి చేసుకొమ్మని చెప్పినా మరో యువతికి అన్యాయం చేసినట్లు అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చి.. పెద్ద మనుషుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ మూడు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు.
తాము ఒక కాయిన్‌తో టాస్ వేస్తామని, ఆ టాస్‌లో ఎవరు నెగ్గితే ఆ యువతిని సదరు యువకుడికి ఇచ్చి వివాహం జరిపిస్తామని చెప్పారు. అనంతరం టాస్ వేయడంతో విషం తాగిన యువతి గెలిచింది. దాంతో ఆ యువతినే సదరు యువకుడు పెండ్లి చేసుకోవాలని పెద్దలు నిశ్చయించారు. అయితే, ఇలా టాస్ వేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా కూడా తాము ఒక యువతికి అన్యాయం చేశామనే విషయాన్ని పెద్దలు గ్రహించలేకపోయారు. ఇద్దరిని మోసగించిన యువకుడిని మాత్రం పెండ్లి కొడుకును చేసి ఇంట్లో కూర్చోబెట్టారు.