Revanth Reddy: కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడు, ఎక్కడా ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీతో నేరుగా బహిరంగంగా గొడవపెట్టుకుంటున్న నాయకుడు కేసీఆర్. బీజేపీ కూడా కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీ నేతలను ఎలా ఇరికించాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి వచ్చి వింత వ్యాఖ్యలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి, మళ్ళీ మోడీని పీఎంను చెయ్యడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టాడని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను నమ్మడానికి ఎలాంటి ఆధారాలను మాత్రం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ చూపించడం లేదు. కానీ గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు తెలిపాడని కాదు ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు , కేసీఆర్ ఏదైనా చెయ్యగలడు కానీ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడని ఆధారలు లేకుండా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ను బలహీనపరచడానికా!!
కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పెట్టిందే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపరచడానికని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చుస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ను ఎవరో బలహీనపరచాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ ఆల్రెడీ చాలా బలహీనపడింది. అసలు ఇంకొన్నాళ్ళుంటే కాంగ్రెస్ ఉందన్న విషయాన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు . కాంగ్రెస్ ఎంత బలహీనపడిందంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు కనీసం ఒక్కసారి కూడా గెలిపించి, అధికారం ఇవ్వలేదు. ఇంత కంటే పార్టీ బలహీనపడటం ఏముంటుంది. పైగా వాళ్లలో వాళ్ళే నిత్యం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వాళ్ళను వాళ్ళే బలహీనపరుచుకున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితికి చేరుకుంది.
పాదయాత్ర ఏమైంది సార్!!
కాంగ్రెస్ లో ఎన్నో గొడవలు ఉన్నాయ్ కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా పార్టీ కోసం చేస్తున్న కొంతమందిలో రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన పార్టీకి పెద్దగా ఉండటం నచ్చని వాళ్ళే గొడవలు చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ కోసం పని చేస్తూ, ప్రభుత్వాన్ని నిత్యం ఎదో ఒక విధంగా ప్రశ్నిస్తున్నారు. అయితే మొన్నీ మధ్య రేవంత్ రెడ్డి జనవరి 26న పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు దాని గురించి ఏమి సప్పుడు చేస్తలేరు. ఆ పాదయాత్ర చేస్తాడా లేదా అన్న విషయంపై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి రావాలని తీవ్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వాళ్లపై వాళ్ళు వ్యూహాలు రచించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుందో లేదో చూడాలి మరి.