Harish Rao: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అధికారం నుండి దించెయ్యాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా తెలంగాణాలో బీఆర్ఎస్ ను ఓడించాలని చాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బడ్జెట్ హడావిడి జరుగుతుంది. ఈ నేపధ్యంలోనే బీజేపీపైన మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో జీడీపీని తగ్గించడంలోనూ, మతపిచ్చిని పెంచడంలోనూ బీజేపీ చాలా సక్సెస్ అయ్యిందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేని బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం సరికాదని, కేంద్రం నుండి దాదాపుగా 1 లక్ష కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని, వాటిని కేంద్రం ఇవ్వకుండా తెలంగాణతో ఆదుకుంటుందని హరీష్ తెలిపారు. అలాగే కేసీఆర్ చేస్తున్న పథకాలను కాపీ కొట్టి చేస్తున్న పనులను కూడా కేంద్రం సరిగ్గా చెయ్యడం లేదని, దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని హరీష్ తెలిపారు.

Harish Rao
Harish Rao

కాపీ క్యాట్ బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను చూసి, కేంద్రం కాపీ చేస్తుందని, అలా చేసి కూడా బీజేపీ నాయకులు వాటిని సరిగ్గా అమలు చెయ్యడం లేదని హరీష్ అన్నారు. మిషన్ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపామని చెప్పిన హరీశ్ రావు.. తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్ జల్ అమృత్ కాల్ సవ్యంగా సాగడం లేదన్నారు. అమృత్ కాల్ అని చెబుతున్న బీజేపీ పాలన దేశ ప్రజలకు ఆపద కాలం వస్తోందని విమర్శించారు. గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపడే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించామన్నారు. ఇలా ఎన్నో పథకాలను బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నుండి కాపీ చేసిందని అన్నారు.

పవర్ ఇచ్చారు

బీజేపీలో ఉన్న నాయకులకు బీజేపీ పెద్దలు ఏ కాషాయం తాగిస్తారో తెలియదు కానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం వాళ్ళకే సాధ్యం. దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబటం లేదు.. విబడటం లేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రజలకు కావాల్సినంత పవర్ ఇచ్చినందుకే తమకు పవర్ ఇచ్చారని మంత్రి చెప్పారు. ప్రజలకు తాము నిరంతరం పవర్ ఇస్తామని, ప్రజలు కూడా తమకే పవర్ ఇస్తారని వ్యాఖ్యానించారు. పవర్ హాలీడే ఇచ్చారు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రైతులు సంబరపడుతున్నారని అన్నారు. వాళ్లకు ఎప్పటికీ పవర్ రానట్లుందని విపక్షాలకు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వలేని పార్టీలో ఉన్న నేతలు కూడా ఇంత చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాల హాస్యాస్పదమని తెలిపారు.