ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకొని జిల్లా కలెక్టరేట్‌తోపాటు పోలీసు కమిషనరేట్‌ను, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది. సోమవారం వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కాళోజీ యూనివర్సిటీ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజచేయనున్నారు. 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లన్నారు. గ్రామ ప్రజలతో సమస్యలపై చర్చించి, వారితో సహపంక్తి భోజనం చేయనున్నారు.

పరిపాలన మరింత చేరువయ్యేలా..

ప్రభుత్వ కార్యాలయానికి పనిమీద వచ్చిన ప్రజలు ఒక్కో విభాగం అధికారి కోసం జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలకు రోజంతా తిరగాల్సిన అవసరం లేకుండా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాలన్నీంటిని ఒకేచోట ఉండేలా సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీంతో రెండు మూడురోజుల్లో అయ్యేపనిని ఒక్కపూటలో కానున్నది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశారు. దీంతో మారుమూల చివరిగ్రామం నుంచి కూడా గంటలో జిల్లా కేంద్రానికి చేరుకొనే అవకాశం ఏర్పడింది. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఒక దినమంతా పట్టేది. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలతో మారుమూల నుంచి పనిపై కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే వ్యక్తి ఒక్కపూటలో అన్నిశాఖల అధికారులను కలిసి పని పూర్తిచేసుకొని ఇంటికి చేరుకొనే అవకాశం ఏర్పడింది.

హరిత భవనాలుగా కలెక్టరేట్లు

సమీకృత కలెక్టరేట్‌ భవనాలు, పోలీసు కమిషనరేట్‌, ఎస్పీ భవనాలను కొత్త జిల్లాలతోపాటు కొన్ని పాత జిల్లాల్లో కూడా నిర్మిస్తున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లను పర్యావరణ పరిరక్షణ ఉండేలా హరిత భవనాలుగా నిర్మించారు. 25 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాలు నిర్మిస్తుండగా, ఒక్కో భవనాన్ని దాదాపు రూ.50 కోట్లనుంచి రూ.60 కోట్లతో 1.50 లక్షల చదరపు అడుగులు ఉండేలా చూస్తున్నారు. వీటిలో 12 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్‌అర్బన్‌ కలెక్టరేట్‌ భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నిజామాబాద్‌, జగిత్యాల, జనగామ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్‌, వనపర్తి, మమబూబ్‌నగర్‌, యాదాద్రి భవనగిరి కలెక్టరేట్‌ భవనాలు సైతం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి భవనం ‘యు’ ఆకారంలో ఉంటుందని, మధ్యలో అతి పెద్ద ఓపెన్‌ఏరియా ఉంటుందని, దీంతో గాలి, వెలుతురు బాగా వస్తుందని ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి వివరించారు. కలెక్టరేట్‌ భవనాలకు అతి సమీపంలోనే కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల నివాసానికి జీ ప్లస్‌-1 పద్ధతిలో, జిల్లాస్థాయి అధికారులు నివాసానికి వీలుగా దాదాపు రూ.7-8 కోట్లతో క్వార్టర్లను నిర్మించారు. దీంతో కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలాచేశారు. ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి (శంషాబాద్‌), కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, మహబూబాబాద్‌ కలెక్టరేట్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కరీంనగర్‌, ములుగు, నారాయణపేట కలెక్టరేట్‌ భవనాలు నిర్మించాలని తరువాత నిర్ణయించి ఆ మేరకు నిధులు కేటాయించారు. వీటికి భూమి కేటాయింపులు, భూమి నాణ్యత పరీక్షలు చేపడుతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 20, 2021 at 8:48 ఉద.