KCR: తెలంగాణ కోసం తానూ పోరాడుతున్న సమయంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నాయకులు అప్పుడు ఎవరి కాళ్ళ దగ్గర ఉన్నారో తనకు తెలియదని అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ అని, 2004లో ఇస్తామని చెప్పి, 2014 లో తానూ 32 పార్టీల మద్దతు కూడగట్టిన తరువాత కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

పాలమూరులో అంబలి కేంద్రాలు ఉండేవి
తెలంగాణ రావడానికి ముందు మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, ఇక్కడి ప్రజలు బతకడానికి ముంబైకి వెళ్లేవారని, ఇక్కడే గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని కేసీఆర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఆపటానికి కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారని, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తనకు పేరు వస్తుందని, అందుకే కాంగ్రెస్ నేతలు ప్రజలకు నష్టం చెయ్యడానికి కూడా వెనక్కితగ్గలేదని, అలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు.
దేశంలో తెలంగాణ నెంబర్ 1
తెలంగాణ వచ్చినప్పుడు అందరు ఇక్కడ కరెంటు కష్టాలు ఉంటాయని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు దేశంలోనే 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం తానూ పోరాడాల్సింది అయిపోయిందని, ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలే పోరాడి మళ్ళీ రాష్ట్రానికి మంచి చేసే నాయకుడి గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తారని, అందుకే ఆ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరి వైపు ఉంటారో వేచి చూడాలి.