పట్టు ఉత్పత్తికి బహిరంగ మార్కెట్లో గిరాకీ ఉండటంతో రైతులు ఆ దిశగా ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు రైతులకు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని ఐలయ్య, నర్సింలు కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సాయంత్రం మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. మల్బరీ తోటల సాగు పెంపకాన్ని ఏ విధంగా చేపడుతున్నారని ఆరా తీశారు. షెడ్డులో పట్టు పురుగుల పెంపకంలో అవలంభిస్తున్న విధి విధానాలను ఆ రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారని వారిద్దరినీ మంత్రి అభినందించారు. ఈ మేరకు ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్ర- ములుగు, శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మీ, మల్బరీ సాగు చేస్తున్న ఐలయ్య, నర్సింలుతో కలిసి సాగుకై ఒక్కొక్కటిగా ముందు నుంచి చేపట్టిన అంశాలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలను గురించి ఆరా తీసి మల్బరీ సాగులో ఐలయ్య, నర్సింలు కుటుంబ సభ్యులు 6 నెలల్లో 8 లక్షలు సంపాదించారని, వీరిని ఆదర్శంగా.. స్పూర్తిగా తీసుకుని, మరింత మంది ముందుకు రావాలని రైతులను మంత్రి కోరారు.

మల్బరీ తోటల సాగుకై ముందుకు వస్తే రైతుల ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకుందామని ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. జిల్లాలో 650 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తుండగా, చిన్నకోడూరు మండలంలో 100 ఎకరాలు సాగు చేస్తున్నట్లు, ఇవాళ కొత్తగా 200 ఏకరాలు సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్లు, చిన్నకోడూరు మండలంలో మొత్తం 300 ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఇందుకు ప్రభుత్వం, ప్రైవేట్ పరంగా వచ్చే కావాల్సిన పలు రాయితీల విషయమై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ పరంగా అనుకూలంగా వచ్చేలా కావాల్సిన చర్యలు తీసుకుందామని మంత్రి భరోసా ఇచ్చారు.

 రైతుల ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకుందాం: మంత్రి హరీష్ రావు   

అంతకు ముందు మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు రైతులు మంత్రికి వివరించారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చునని, సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నామని., మల్బరీ తోట పక్కనే రెండు షెడ్లు నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నామని, ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు మీరు రావడం సంబురంగా ఉన్నదని రైతులు ఐలయ్య, నర్సింలు పేర్కొన్నారు. గతంలో రెండున్నర ఎకరాలు పెట్టామని, ఇప్పుడు 4 ఏకరాలు పెడుతున్నామని చెప్పుకొచ్చారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 9, 2021 at 8:43 ఉద.