Nara Bhuvaneswari: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతికి ఫాక్స్ కాన్ కంపెనీని, అనంతపురానికి కియో మోటార్స్ కంపెనీని తెచ్చారని కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మాత్రం కంపెనీస్ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని, దానికి కారణం జగన్ ప్రభుత్వం యొక్క అరాచకాలు కారణమని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుని వైసీపీ ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేసి, 48 రోజులుగా ఆయనను ప్రజలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు.

గతంలో తిరుపతికి చంద్రబాబు నాయుడుతోనే వచ్చేవారమని, ఇప్పుడు వైసీపీ చేసిన అక్రమ అరెస్ట్ వల్ల తమ కుటుంబంలోని నలుగురం నాలుగు దిక్కులకు తిరగాల్సి వచ్చిందని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడేది లేదని, అక్రమ కేసులపై బలంగా టీడీపీ కార్యకర్తలంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రస్థానం ఎస్వి యూనివర్సిటీలోనే ప్రారంభం అయ్యిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కలిసి వైసీపీ నాయకులకు బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుండి నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి కూడా పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా షర్మిల, విజయమ్మ చేసిన ప్రచారం కూడా వైసీపీ గెలుపుకు దోహదపడింది. ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మిణి చేస్తున్న ప్రచారం కూడా టీడీపీకి ఎంతలా ఉపయోపడుతుందో వేచి చూడాలి.