కోనసీమ ప్రాంతంలో రైతులు క్రాప్‌హాలీడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంటేనే పచ్చని పైర్లకు చిరునామా అని, మూడు పంటలు పండే అటువంటి ప్రాంతంలో రైతులు పంటల విరామానికి నిర్ణయం తీసుకోవడంపై నారా లోకేష్ ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పూడుకుపోయిన డ్రైయిన్లు, వరుస విపత్తులు, ముంపు బెడతతో పంట విరామానికి కోనసీమ రైతులు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరనమ్నారు. ఎందరు అధికారులు వచ్చి పరిశీలించినా డ్రైయిన్లు, ముంపు సమస్యని పరిష్కరించడంలేదని గత్యంతరం లేకే ఖరీఫ్‌కి క్రాప్ హాలీడే ప్రకటించామని కోనసీమ రైతులు చెబుతున్నారు. కోనసీమ ప్రాంతాలైన సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాలలో ఏటా వేలాది ఎకరాలు ముంపునకు గురై, కోట్ల రూపాయల పంటనష్టపోతున్న రైతులు 2011 తరువాత క్రాప్ హాలీడే నిర్ణయం తీసుకోవడం వారి ఇబ్బందుల తీవ్రతని తెలియజేస్తోందన్నారు.
రైతులకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలివ్వాలి
ఈ ఏడాది పంటకాల్వలకు ముందుగానే నీరు వదిలినా నాట్లు వేయకుండా పంట విరామానికి మొగ్గు చూపుతున్న రైతులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం వుందని సూచించారు. క్రాప్ హాలీడేకి రైతులు సిద్ధం కావడానికి ముంపు ప్రధాన కారణమైతే, పంట నష్టపోయినా పంటనష్టపరిహారం అందకపోవడం మరొక కారణంగా తెలుస్తోంది. దీమా కల్పించని బీమా ఎందుకు అంటోన్న అన్నదాతల గోడు విని సర్కారు స్పందించాలని నారా లోకేష్ కోరారు. ఎన్నికష్టాలు ఎదురైనా, ఎంత నష్టం వచ్చినా భరిస్తూ పంటలు వేస్తూ వచ్చిన రైతన్నలు, సర్కారు నుంచి ఎటువంటి సాయం అందక విరక్తితో పంటల విరామానికి తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోనసీమ ప్రాంతంలో క్రాప్‌హాలీడేకి సిద్ధమవుతోన్న రైతుల సమస్యలు తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పరిశీలించి, ప్రోత్సాహాకాలు అందించి మళ్లీ రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నారా లోకేష్ సూచించారు.