గ్రూప్-1 పరీక్షల్లో అవకవతలపై సిబిఐతో విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు – కోర్టు తీర్పు నేపథ్యంలో అభ్యర్థులతో లోకేష్ సోమవారం ఆన్ లైన్ ద్వారా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అభ్యర్థులు అధైర్యపడొద్దని, కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడి విజయం సాధిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ జాబురెడ్డి కాదు…డాబు రెడ్డి అంటూ ఎద్దేవా చేసిన లోకేష్ ఎన్నికలకు ముందు 2.30లక్షల ఉద్యోగాలిస్తానని 10వేలు ప్రకటించడం నిరుద్యోగులను మోసగించడమేనని అన్నారు. తెలుగుదేశం హయాంలో గ్రూప్-1 పరీక్షలను ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని, ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై 300మందికి పైగా అభ్యర్థులు కోర్టుకు వెళ్లారంటే ప్రభుత్వం విశ్వసనీయత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థల పనితీరుపై అనుమానం రావడం విచారకరమని, పూర్తిస్థాయి విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తేనే భవిష్యత్ లో ఇటువంటి పొరపాట్లు జరగవని ఆయన అన్నారు.
గ్రూప్ -1 అభ్యర్థుల చర్చా కార్యక్రమం వివరాలు మీ కోసం….
ముఖ్యమంత్రి జగన్ జాబు రెడ్డి కాదు…డాబురెడ్డి: నారాలోకేష్
ఆలస్యమైనా న్యాయం గెలిచింది. న్యాయం కోసం పోరాడిన వారందరికీ అభినందనలు. ఇది మొదటి విజయం. కోర్టు కీలకమైన ఆదేశాలచ్చింది. ఎపిపిఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. మధ్యప్రదేశ్ లో జరిగిన వ్యాపమ్ కుంభకోణం కంటే పెద్దది. అర్హులకు ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యం. ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మాన్యువల్ వాల్యుయేషన్ జరగాలి. ఎంపికైన అభ్యర్థుల లిస్టు ప్రకటించాలి. డిజిటల్ వాల్యుయేషన్ పై శ్వేతపత్రం ఇవ్వాలి. అభ్యర్థుల పేపర్లు వెబ్ సైట్ లో పెట్టాలి. ప్రభుత్వం స్పందించి చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. లేకపోతే అభ్యర్థులతో కలిసి న్యాయ పోరాటం చేస్తాం. ఎపిపిఎస్సీ రాజకీయ వేదిక కాదు, ఇప్పుడు దానిని రాజకీయం చేశారు. 2017లో టిడిపి హయాంలో గ్రూప్-1 పకడ్బందీగా నిర్వహించాం. ఎన్నికలముందు జాబ్ రెడ్డి, ఎన్నికలయ్యాక డాబు రెడ్డి. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు కేవలం 36 ఖాళీలు ప్రకటించారు. 2.30లక్షల ఉద్యోగాలిస్తానని కేవలం 10వేలు ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంఓయులు చేసుకున్నవారు వెనక్కి వెళ్లిపోయారు. రెండేళ్లలో ఆరులక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సొంత కార్యకర్తలకు ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు, ఆర్టీసి ఉద్యోగాలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పాతవే. ఎ2 90శాతం వాలంటీర్ ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలవే అని నారాలోకేష్ అన్నారు.