తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడం తోపాటు, ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వలన, జిల్లా స్థాయి పోస్టయిన జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని జోన్లు, మల్టీ జోన్ ఉద్యోగాల వరకు ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామన్నారు.

ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే లభించే అవకాశం     

కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్- ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్శించగలిగాం. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు మరియు యువత పక్షాన మరొక్కమారు కృతజ్ఞతలు తెలిపారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 2, 2021 at 8:38 సా.