టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది. కార్యకర్తల ప్రయోజనాలు, వ్యక్తిగత లబ్ధి కోసం ఏ పార్టీ చేపట్టని కార్యక్రమాలను టీడీపీ చేపట్టి చూపిస్తోంది. కార్యకర్తలకు సభ్యత్వం ఇవ్వడమేకాకుండా.. బీమా, ఆరోగ్యం ఇతర సౌకర్యాలను కల్పిస్తూ అండగా నిలుస్తోంది. అంతేకాదు.. కరోనా కాలంలో టీడీపీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవలను అందించింది. కొంతమంది కార్యకర్తలు వేధింపులకు గురవుతుండటం గమనించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ‘itdp‘ అనే వెబ్ సైట్ ను ప్రారంభించి పెద్దన్నలా నిలిచారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాను ‘‘కార్యకర్తల మనిషినని’’ మరోసారి చాటుకున్నారు.
పరామర్శించి.. ధైర్యం చెప్పి..
బొప్పాన రాఘవేంద్ర రావు టీడీపీ కార్యకర్త. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు వీరాభిమాని. అయితే ఆయన గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చంద్రబాబుని చూడాలనేదే తన చివరి కోరిక. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు తన కాన్వాయ్‌ను రాఘవేంద్రరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి మళ్లించి పరామర్శించారు. ఏమీకాదని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పార్టీలో ప్రతి కార్యకర్త క్షేమం కోసం తాపత్రయపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.