TDP: వైసీపీలో ఉన్న చాలామంది నేతలు టీడీపీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ తిడుతూ ఉంటారు కానీ వాళ్ళందరిలో కొడాలి నాని శైలి మాత్రం వేరుగా ఉంటుంది. ఆయన గతంలో టీడీపీలో ఉండి, ఆ పార్టీలో ఉన్న లోటుపాట్లు అన్నీతెలిసినవాడు. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇన్ని విమర్శలు చేస్తున్న కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. గుడివాడలో కొడాలికి ప్రజల నుండి మద్దతుగా గట్టిగా ఉంది. కానీ అక్కడ టీడీపీ అనుకున్నంత బలంగా లేదు. టీడీపీలోని నేతల మధ్యే సరైన సఖ్యత లేకపోవడం వల్లే టీడీపీ యొక్క బలం తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక కీలక నేత వల్ల గుడివాడలో టీడీపీ మళ్ళీ బలపడిందని, వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి ఓటమి తప్పదని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కలిసిపోయిన టీడీపీ నేతలు
టీడీపీ నాయకుల మధ్య సరైన సంబంధాలు లేకపోవడం వల్ల గుడివాడలో జరగాల్సిన మినీ మహానాడు కూడా జరగలేదు. అందుకే అధిష్టానం పెద్దలు గుడివాడ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో నాయకులంతా ఇప్పుడు కలిసిపోయినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ నేతలు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ గుడివాడ వచ్చి అన్న క్యాంటిన్ ను అదేరోజు ప్రారంభించారు. అయితే ఈ ఐక్యత ఎంతవరకు ఉంటుందో ఎవ్వరికి తెలియడం లేదు. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ నేతలు మొదట కలిసే ఉన్నాయ్, కానీ ఎన్నికల సమయానికి వాళ్లంతా వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాముకేనా సీట్!!
ఎన్నారై వెనిగండ్ల రాము గుడివాడలో జోరుగా పనులు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలను విస్తరించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు రాముకేనని ప్రచారం మొదలైంది. సేవా కార్యక్రమాలు నిర్వహించడంద్వారా నాయకులందరినీ రాము కలుపుకొని వెళుతున్నారు. అధిష్టానం ఆదేశాలతోపాటు రాము సేవా కార్యక్రమాలు తెలుగు తమ్ముళ్లలో ఐకమత్యాన్ని పెంచింది. వచ్చే ఎన్నికల్లో రాముకే సీట్ కంఫర్మ్ చెయ్యడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అంతా అనుకుంటున్నారు. ఒకవేళ అన్నీ రాముకు కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి టీడీపీ తరపున పోటీ చెయ్యనున్నారు. ఎలాగో జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికలో గుడివాడ నుండి టీడీపీకి విజయం ఖాయంగా కనిపిస్తుంది.