హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేట కలాన్‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను మంత్రి ఐకేరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రెండో దశతో దేశమంతా తల్లడిల్లిపోయిందన్నారు.

ఆక్సిజన్‌ అందక ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందన్నారు. భవిష్యత్‌ కోసం పుడమిని కాపాడుకునేందుకు సమష్టిగా పని చేయాలన్నారు. మనకు కావాల్సిన ఆక్సిజన్‌ చెట్ల ద్వారానే లభిస్తుంది, పిల్లల భవిష్యత్‌ కోసం చేపట్టిన కార్యక్రమనన్నారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమమే కాదని.. ప్రజల కార్యక్రమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రూ.5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు.

ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలక పాత్ర

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారుతాయన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని, పచ్చదనం పెరిగేలా చట్టాల్లో సీఎం కేసీఆర్‌ కఠినమైన నిబంధనలు పెట్టారని చెప్పారు. 85 శాతం మొక్కలు బతకపోతే స్థానిక ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టారన్నారు.

హరితహారం మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం అన్న సోయి అందరికీ రావాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్‌ కల నెరవేరి.. దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల స్ఫూర్తితో కేంద్రం నగరవన్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ను యావత్‌ దేశం అనుకరిస్తుందని.. మిషన్‌ భగరీథ పథకంతో పాటు రైతుబంధు పథకాన్ని కేంద్రం అనుకరించిందన్నారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిపిన అటవీశాఖకు అభినందనలు తెలిపారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 1, 2021 at 5:56 సా.