ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సిఎం కెసిఆర్ గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి నీనున్నాననే భరోసాను ధైర్యాన్నిచ్చారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సిఎం కెసిఆర్ కలియతిరిగారు. బెడ్ల వద్దకు పోయి అందరి పేషెంట్ల తో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేరు వివరాలు అడిగి తెలుసుకోని మరీ ప్రత్యేకంగా జనరల్ వార్డుల్లోకి కూడా వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. వారికి దైర్యం చెప్పారు. మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎట్లా వున్నదని అడిగారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో…గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సీజన్ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సిఎం ఆదేశాలమేరకు నెలకొల్పారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ను ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సీజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సిఎం కెసిఆర్ స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద వున్నదని సిఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 19, 2021 at 9:03 సా.