New Income Tax Website : ఈరోజుల్లో ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు. మనం సంపాదించిన ప్రతి రూపాయిని ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. లేకపోతే.. మనం సంపాదించిన డబ్బుకు విలువే లేకుండా పోతుంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం ఇన్ కమ్ టాక్స్ ను తీసుకొచ్చింది. ఎంత ఎక్కువ సంపాదిస్తే.. అంత ఎక్కువ టాక్స్ ను ప్రభుత్వానికి పే చేయాలి. లేదంటే ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఇప్పుడంతా ఆన్ లైన్. ఆన్ లైన్ లో ఏం చేసినా తెలిసిపోతుంది. ప్రతి దానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ అయి ఉండటం వల్ల.. ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు.

అయితే.. ఇన్ని రోజులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ వేరు. ఇప్పటి ప్రక్రియ వేరు. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్.. ఇటీవలే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సరికొత్త ప్రక్రియను తీసుకొచ్చింది. సరికొత్త వెబ్ సైట్ ను సోమవారం అంటే జూన్ 7న లాంచ్ చేసింది. ఆ వెబ్ సైట్ పేరు https://www.incometax.gov.in. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ చేసేవాళ్లు.. ఇప్పుడు ఈ వెబ్ సైట్ కు లాగిన్ అయి.. వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కొన్ని మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది ఐటీ శాఖ. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
New Income Tax Website : ఐటీ టాక్స్ పేమెంట్ లో కొత్తగా వచ్చిన ఫీచర్లు ఇవే
ఇది వరకు టాక్స్ పేమెంట్ కోసం ఆన్ లైన్ లో పే చేయడానికి అన్ని ఆప్షన్లు ఉండేవి కావు. కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉండేవి. దీనివల్ల టాక్స్ పేయర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త పేమెంట్ విధానాన్ని ఐటీ శాఖ తీసుకొచ్చింది. టాక్స్ పేమెంట్ కోసం నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్ లాంటి ఆప్షన్లను తీసుకొచ్చింది. వీటిలో ఏ ఆప్షన్ అయినా ఉపయోగించుకొని టాక్స్ పే చేయొచ్చు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాక.. మీరు అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు, పెండింగ్ యాక్షన్స్ అన్నీ ఒకే పానెల్ లో కనిపిస్తాయి. దాని వల్ల.. ఏ ఏ అంశాలు పెండింగ్ లో ఉన్నాయో టాక్స్ పేయర్లు ఒకే పానెల్ లో తెలుసుకునే అవకాశం ఉంది.
చాలామందికి ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో తెలియదు. మొదటి సారి దాఖలు చేసేవాళ్లు ఎదుర్కొనే సమస్యలు కూడా అవే. అందుకే.. అటువంటి వాళ్ల కోసం ఐటీఆర్ ప్రిపరేషన్ సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐటీ శాఖ. దానిలో ఇంటరాక్టివ్ ప్రశ్నలను పొందుపరుస్తారు. దాని వల్ల.. టాక్స్ పేయర్లకు ఎటువంటి సందేహం ఉన్నా అక్కడ క్లియర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
టాక్స్ పేయర్స్ వాళ్ల ప్రొఫైల్ ను అప్ డేట్ చేసుకోవాలనుకుంటే.. తర్వాత కూడా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముందే.. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మిగితా వివరాలు అంటే సాలరీ, క్యాపిటల్ గ్రోత్, వడ్డీ, ఇతర ఆదాయం.. అన్నింటినీ టీడీఎస్ డౌన్ లోడ్ చేసుకున్నాక.. ఇన్ కమ్ టాక్స్ ఫైలింగ్ డెడ్ లైన్ లోపు ఇచ్చే అవకాశం ఉంటుంది.
కొత్త టాక్స్ ల వివరాలు, FAQ, యూజర్ గైడ్ కోసం లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాల్ సెంటర్ సపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. చాలామందికి వచ్చే సందేహాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈసారి పొందుపరిచారు.
ఇన్ కమ్ టాక్స్ ఫామ్స్ ను నింపడం కోసం కావాల్సిన మరికొన్ని ఎక్స్ ట్రా ఫీచర్స్ ను కూడా ఈసారి కొత్త వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా టాక్స్ పేమెంట్స్ జూన్ 18, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇన్ కమ్ టాక్స్ కు సంబంధించిన మొబైల్ యాప్ కూడా అప్ టు డేట్ ఉండేలా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటోంది.