Phone Hacking : ఇప్పుడు ప్రపంచమే మన గుప్పిట్లో ఉంది అంటే దానికి కారణం ఒకే ఒక్క డివైజ్. అదే స్మార్ట్ ఫోన్. అది చేతుల్లో ఉంటే చాలు ఈ ప్రపంచాన్నే చుట్టి రావచ్చు. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చక్కపెట్టేయవచ్చు. చివరకు ఉద్యోగం కూడా స్మార్ట్ ఫోన్ తో చేసే రోజులు వచ్చాయి అంటే… మానవాళి టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్లిందో అర్థం అవుతుంది. మన పెద్దలు చెబుతుంటారు కదా.. మంచి ఉన్న చెడు ఉంటుంది అని… దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా.. అలాగే టెక్నాలజీలో మనం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా… దాని వల్ల ఎన్ని లాభాలు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దాని వెనుక అన్ని మోసాలు కూడా ఉన్నాయి. నిజానికి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే చదువుకున్న వాళ్లే అయి ఉండాల్సిన అవసరం లేదు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా స్మార్ట్ ఫోన్ ను ఆపరేట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. అందుకే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటోంది. కాల్స్ కోసమే కాదు… సోషల్ మీడియా అకౌంట్లు మెయిన్ టెన్ చేయడం కోసం, ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం, బ్యాంకు లావాదేవీలకు, ఆన్ లైన్ షాపింగ్ కు, ఫోటోలు, వీడియోలు తీయడానికి, మ్యాప్స్ కోసం, లైవ్ లొకేషన్ కోసం, పేమెంట్స్ కోసం… ఇలా అన్నిరకాల పనులను ఇంట్లో ఉండే చక్కదిద్దుతున్నాం అంటే దానికి కారణం స్మార్ట్ ఫోన్.

అయితే.. స్మార్ట్ ఫోన్ ఉంది కదా… దాంట్లోనే అన్ని పనులు అయిపోతున్నాయి కదా అని మనం సంతోషపడే లోపే మన వెనుక ఉంటూ… మనం ఫోన్ లో ఏం చేస్తున్నామో అన్నీ చూస్తున్నాడు ఓ బూచోడు. ఆ బూబోడికి 24 గంటలు మన ఫోన్ మీదే కన్ను. ఫోన్ లో ఉన్న డేటాను ఎలా దొంగలించాలా? అనేదే వాడి ప్లాన్. చాలామంది తన ఫోన్లను హ్యాకర్ల చేతికి ఇచ్చే ఎంతో మోసపోయారు. ప్రతిరోజు న్యూస్ చానెళ్లలో, పేపర్లలో ఇటువంటి వార్తలు ఎన్నో చదువుతున్నాం. అయినప్పటికీ చాలామంది ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఫోన్లు ఎలా హ్యాక్ కు గురవుతున్నాయి? అసలు.. స్మార్ట్ ఫోన్ హ్యాక్ కు గురయిందని ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ కు గురయ్యాక చేయాల్సిన పని ఏంటి?
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయిందా? లేదా?
మీ ఫోన్ అసలు హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే.. ముందు ఫోన్ పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో అంచనా వేయాలి. ఉన్నట్టుండి ఫోన్ బ్యాటరీ తగ్గిపోయినా… ఎంత చార్జింగ్ చేసినా ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతున్నా… ఫోన్ అసలు వాడకున్నా కూడా బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోయినా… మీ ఫోన్ హ్యాక్ అయినట్టు అనుమానించవచ్చు. ఎందుకంటే… మీకు తెలియకుండా మీ ఫోన్ లోకి వచ్చిన వైరస్… మీ డేటాను సైబర్ నేరగాళ్లకు పంపించే క్రమంలో మీ బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే ఫోన్ నెమ్మదించినా… సడెన్ గా ఆగిపోయినా.. అప్పుడప్పుడు స్ట్రక్ అవుతున్నా.. యాప్స్ ఓపెన్ చేసినా ఓపెన్ కాకుండా ఫోన్ మధ్యలో ఆగిపోతున్నా… ఫోన్ హ్యాక్ కు గురయినట్టు అనుమానించవచ్చు.

ఒక్కోసారి ఇంటర్నెట్ డేటాను ఉపయోగించకున్నా.. జీబీలకు జీబీలు ఖర్చవుతుంటాయి. అంటే మీ ఫోన్ లోకి వైరస్ చొరబడి… కొన్ని స్పై యాప్స్ ను రన్ చేస్తుంటుంది. మీ ఫోన్ లోని డేటాను స్పై యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్ల సర్వర్ కు చేరవేస్తుంటుంది. దాని వల్ల ఎక్కువ డేటా ఖర్చవుతుంది. మీరు కొన్ని నెంబర్లకు ఫోన్ చేయకున్నా.. మెసేజ్ చేయకున్నా ఆటోమెటిక్ గా వాటంతట అవే వెళ్తుంటాయి. మీ ఫోన్ లో ఒకవేళ వైరస్ కానీ మాల్ వేర్ కానీ ఉంటే అది మీకు తెలియకుండానే కాల్స్ చేయడం.. మెసేజ్ లు పంపించడం లాంటివి చేస్తుంది. ఒక్కోసారి ఫోన్ లో సడెన్ గా కొన్ని పాప్ అప్ విండోస్ వస్తుంటాయి. అవి మీ ఫోన్ లో వైరస్ ఉందని… లేదా మీ ఫోన్ హ్యాక్ కు గురయిందనే మెసేజ్ ను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. మీకు సోషల్ మీడియా అకౌంట్లు ఉంటే.. ఆ అకౌంట్లలో ఏదైనా అనుమానిత మెసేజ్ లు పోస్ట్ అయినా… మీ ఈమెయిల్ బాక్స్ లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా… మీ ఫోన్ హ్యాక్ గురయిందని అనుమానించవచ్చు.
Phone Hacking : ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి?
ఫోన్ హ్యాక్ అయినట్టు కనుక మీకు అనిపిస్తే… అలాంటి సంకేతాలు ఉంటే.. వెంటనే ఒక మంచి మొబైల్ సెక్యూరిటీ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. ఆ యాప్ తో ఒకసారి మీ ఫోన్ ను అంతా స్కాన్ చేయండి. ఏదైనా వైరస్ కానీ… మాల్ వేర్ కానీ ఉంటే దాన్ని సెక్యూరిటీ యాప్ తొలగిస్తుంది.
అయితే… ఫోన్ లో సెక్యూరిటీ(యాంటీ వైరస్) యాప్ ను వేసుకోగానే కాదు.. మరోసారి ఫోన్ హ్యాక్ కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వైఫై వస్తోంది కదా.. అని ఫ్రీ వైఫైకి కనెక్ట్ కాకండి. ఆ ఫ్రీ వైఫై ద్వారా కూడా హ్యాకర్లు మీ మొబైల్ లోకి వైరస్ ను పంపించే ప్రమాదం ఉంది.
ఎప్పుడూ అవసరం ఉన్న యాప్స్ ను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోండి. ఏ యాప్ పడితే ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోకండి. యాప్ క్రెడిబిలిటీని చెక్ చేసి అప్పుడు ఇన్ స్టాల్ చేసుకోండి. వాడని యాప్స్ ఏవైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయండి. ఏ యాప్ పడితే ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే.. యాప్స్ ద్వారా హ్యాకర్స్ వైరస్ ను ఫోన్ లోకి పంపిస్తుంటారు.
వాట్సప్ ద్వారా ఏవైనా లింక్స్ పంపించినా… ఈమెయిల్స్ లో పంపించినా… ఈకామర్స్ సైట్లలో ఆఫర్ల పేరుతో పంపించే లింక్స్ అయినా.. ఇతర లింక్స్ ఏవైనా సోషల్ మీడియా ద్వారా వస్తే అస్సలు క్లిక్ చేయకండి. ఆ లింక్స్ ద్వారానే హ్యాకర్లు వైరస్ ను ఫోన్ లోకి పంపిస్తుంటారు. లింక్ క్లిక్ చేశారంటే అంతే… మీ ఫోన్ హ్యాకర్ల చేతికి పోయినట్టే.. దీన్నే ఫిషింగ్ అటాక్(Phishing Attack) అని అంటారు. అలాగే ఫోన్ లో వచ్చే పాప్ అప్ విండోస్ మీద కూడా తొందర పడి క్లిక్ చేయకండి. ఎప్పుడూ ఫోన్ ను అప్ డేట్ చేసుకుంటూ… లేటెస్ట్ ఓఎస్ ను అప్ గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి.