IIT Madras : ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనోళ్లు లేరు. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. అయితే.. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఓఎస్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. నూటికి 90 శాతం కాదు కాదు 99 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో ఉండేది ఆండ్రాయిడ్ ఓఎస్. కేవలం ఐఫోన్లలో, ఇతర యాపిల్ డివైజ్ లలో మాత్రం ఐవోఎస్ ఉంటుంది. యాపిల్ కాకుండా దాదాపు అన్ని బ్రాండ్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ నే వాడుతున్నాయి. ఇవన్నీ వేరే దేశాలు తయారు చేసిన ఓఎస్ లే. ఇదివరకు బ్లాక్ బెర్రీ ఓఎస్ ఉండేది. మైక్రోసాఫ్ట్ కూడా మొబైల్ ఓఎస్ ను డెవలప్ చేసింది కానీ.. అది అంతగా క్లిక్ కాలేదు.
తాజాగా దేశీయ ఓఎస్ ను ఐఐటీ మద్రాస్ డెవలప్ చేసింది. దానికి భార్ఓఎస్ అనే పేరు పెట్టారు. అంటే.. భారత్ అనే పేరు వచ్చేలా పేరును సెట్ చేశారు. జాన్ డికే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సాయంతో ఐఐటీ మద్రాస్ కు చెందిన కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ పేరుతో మేక్ ఇండియా డెవలప్ మెంట్ కోసం సరికొత్త ఉత్పత్తులను తయారు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే భార్ ఓఎస్ ను డెవలప్ చేశారు. ఇది దాదాపుగా 100 కోట్ల మొబైల్ ఫోన్ల యూజర్లు ఒకేసారి ఈ ఓఎస్ ను వినియోగించవచ్చు.
IIT Madras : ఇందులో డిఫాల్ట్ యాప్స్ ఏమీ ఉండవు
ఈ ఓఎస్ డిఫాల్ట్ యాప్స్ ఏం లేకుండా ఉంటుంది. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ లో ముందే కొన్ని యాప్స్ ను ఇన్ స్టాల్ చేసి అమ్ముతారు. వాటిని అన్ ఇన్ స్టాల్ కూడా చేసుకోలేం. దాని వల్ల కొంత మేరకు మెమోరీ వేస్ట్ అవుతుంది. కానీ.. భార్ ఓఎస్ లో అలా కాదు. యూజర్లకు మరింత ఫ్రీడమ్, కంట్రోల్, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం కోసమే ఈ ఓఎస్ ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే.. ఏవైనా అప్ డేట్స్ ఉంటే డైరెక్ట్ గా ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతాయి. ఆటోమెటిక్ అప్ డేషన్ ఉంటుంది. ఈ ఓఎస్ లో ఉండే యాప్ నూటికి నూరు శాతం సేఫ్, సెక్యూర్ అయి ఉంటుంది. ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేదు. భార్ ఓఎస్ స్టోర్ లో ఏదైనా యాప్ ను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత.. దాని వల్ల యూజర్లకు ఎలాంటి సమస్య ఉండదు అని చెక్ చేశాకే స్టోర్ లో యాడ్ చేస్తారు. అయితే.. ఇంకా ఇందులో ఉండే అడ్వాన్స్ ఫీచర్ల గురించి సమాచారం మాత్రం ఇవ్వలేదు. అయితే.. ఈ ఓఎస్ ను కొన్ని బ్రాండ్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది.