indian govt bans 230 betting and loan apps
indian govt bans 230 betting and loan apps

Apps Ban : ఇది స్మార్ట్ ఫోన్స్ యుగం. అందుకే కుప్పలు తెప్పలుగా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఏ యాప్ సేఫ్.. ఏది అన్ సేఫ్ అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పటికే చైనాకు చెందిన పలు యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు బ్యాన్ చేసింది. తాజాగా కేంద్రం మరో 230 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్ ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆ యాప్స్ కేవలం బెట్టింగ్, లోన్ యాప్స్ కాదు.. అవి చైనాకు చెందిన యాప్స్. అందుకే వాటిని బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే ఆ యాప్స్ పై భారత్ లో నిషేధం విధించింది. ఆ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్స్ కూడా వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 69 ప్రకారం.. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.

Apps Ban : చైనా నుంచి యాప్స్ ద్వారా భారత్ కు పెట్టుబడులు

చాలామంది చైనీయులు.. భారత్ ను టార్గెట్ చేసుకొని ఇండియాకు చెందిన వారితో కలిసి ఇటువంటి యాప్స్ ను తయారు చేసి లోన్ల పేరుతో ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి నుంచి ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నట్టు కేంద్రం దృష్టికి వెళ్లింది. బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. చాలామంది లోన్ తీసుకొని వడ్డీలు కట్టలేక, బెట్టింగ్ యాప్స్ ద్వారా ఉన్నదంతా పొగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరిగాయి. తెలంగాణ, ఏపీతో సహా పలు ఇతర రాష్ట్రాల్లో లోన్ యాప్స్ వేధింపులు భరించలేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అందుకే ఇలాంటి యాప్స్ పై కేంద్రం నజర్ పెంచింది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బెట్టింగ్, లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేసుకోండి. వాటిని భారత్ లో ఉపయోగించడం చట్ట విరుద్ధం.